100%రైతు ప్రభుత్వమే | CM KCR Speech About Farmers Welfare | Sakshi
Sakshi News home page

100%రైతు ప్రభుత్వమే

Published Mon, Jan 21 2019 1:01 AM | Last Updated on Mon, Jan 21 2019 10:36 AM

CM KCR Speech About Farmers Welfare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని దేశవ్యాప్తంగా పేరు వచ్చిందని.. నూటికి నూరు శాతం రైతు ప్రభుత్వంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం మాట్లాడారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సభ ద్వారా రైతులకు వాగ్దానం చేస్తున్నామన్నారు. 100% భూరికార్డుల ప్రక్షాళన చేస్తామన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణి వెబ్‌సైట్‌ విప్లవాత్మకమైనదిగా ఉండబోతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు.

బ్యాంకులు కూడా ధరణి వెబ్‌సైట్‌ చూసి రుణాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామన్నారు. రిజిస్ట్రేషన్లలో అవినీతి రహిత విధానాన్ని అమలు చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్‌ అయిన గంటకే మ్యుటేషన్‌ అయ్యేలా చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లలో స్లాట్‌ అలాట్‌ చేస్తామని, వాటి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. ఆ అధికారం తహసీల్దార్లకు ఇస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదన్నారు. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్‌బుక్‌లు ఇచ్చామని వెల్లడించారు. చెప్పింది చేసి చూపించినందుకే ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారన్నారు. ‘రైతు సీఎంగా ఉంటే రైతే రాజు ఎలా అవుతారో ఇపుడు అర్థమైంద’ని చేవెళ్ల నుంచి వచ్చిన ఓ రైతు తనతో చెప్పారన్నారు.

రూ. లక్ష రుణ మాఫీ చేస్తాం
రాష్ట్రంలో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా తాము పాతవే కొనసాగిస్తామని చెబితే కాంగ్రెస్‌ ఏకమొత్తంలో రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పిందన్నారు. అయినా ప్రజలను తమనే విశ్వసించారన్నారు. ఏకమొత్తంలో చేస్తామని చెప్పిన పంజాబ్‌లో ఇంకా అమలు కాలేదని.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సంతకాలు మాత్రమే చేశాయని, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. నాలుగేళ్లలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఇపుడు రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామన్నారు. దానికి సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతోందన్నారు. రిటైర్‌మెంట్‌ వయస్సు పెంపు, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ ఎప్పుడు అమలు చేస్తారన్న ఆతృత అవసరం లేదన్నారు. ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి హామీలపై ఇప్పటినుంచి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని హామీలను అమలుపరుస్తామన్నారు. రూ.5 వేల రైతుబంధు, పింఛన్లు వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి మాత్రం ఐదారు నెలలు ఆలస్యం అవుతుందన్నారు. హామీ ఇవ్వని 76 పథకాలను కూడా అమలు చేశామన్నారు. రైతుబంధు భూ యజమానులకే ఇస్తున్నందున, కౌలు రైతుల విషయంలో యజమానులకు బాధ్యత ఉందన్నారు.

రైతులకు మద్దతు లభించేలా
పంటలకు గిట్టుబాటు ధర మనకు మనమే ఏర్పాటు చేయలేమన్నారు. అది కేంద్రం చేతిలో ఉంటుందన్నారు. అయినా రైతు మద్దతు కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం, 45 వేలకుపైగా ఉన్న మహిళా సంఘాలను పాత్రధారులుగా చేసి.. వ్యవసాయ ఉత్పత్తుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నియోజకవర్గానికి రెండు, మూడు, కొన్నిచోట్ల మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. వాటిల్లో రైతు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని, తద్వారా రైతులు మేలు చేకూరుతుందన్నారు. రైతు ఆత్మహత్యల అంశంపై మాట్లాడుతూ రైతు చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా ఆ రైతు కుటుంబాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రైతు బీమా పథకంతో ఇప్పటివరకు 6,062 మంది రైతు కుటుంబాలకు రూ.303 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఎల్‌ఐసీ ద్వారా బీమా అందిస్తున్నామన్నారు.

ఈఎన్‌టీ.. ఆ తర్వాత రక్త పరీక్షలు
కంటి వెలుగు తర్వాత ఈఎన్‌టీ పరీక్షలు నిçర్వహించాలని నిర్ణయించామని కేసీఆర్‌ పేర్కొన్నారు. కంటివెలుగు ద్వారా కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. ఈఎన్‌టీ పథకాలు అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి రక్త పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి నమోదు చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. పాతాలజీ బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామన్నారు.

అధికారులకే డబుల్‌ బెడ్‌రూం బాధ్యతలు
గత ప్రభుత్వాల హయాంలో గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పైగా ఉచితంగా ఇవ్వకపోవడంతో దర్వాజాలు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. తాము పేదలపై ఉన్న ఆ రూ.4 వేల కోట్ల బకాయిలను రద్దు చేశామన్నారు. ఉచితంగా ఇళ్లు ఇచ్చే చర్యలు చేపట్టామన్నారు. వాటిని హడావుడిగా కట్టబోమన్నారు. ‘ఆలస్యం అవుతుంది గతంలోనే చెప్పాం. గతంలో ఇచ్చినవన్నీ చేసి ఉంటే.. ఇపుడు ఇళ్లు కట్టే అవసరమే వచ్చేది కాదు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. అందుకే గ్రామ సర్పంచి, కార్యదర్శులను బాధ్యులుగా చేసి ఏ గ్రామంలో ఎన్ని అవసరమో లెక్కలు తేల్చి నిర్మిస్తాం’అని కేసీఆర్‌ అన్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్లకే అప్పగించామన్నారు. హైదరాబాద్‌లోని కొల్లూరులో 15,600 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందన్నారు.  

పక్కాగా ‘పంచాయతీరాజ్‌’అమలు
పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎన్నికల కోడ్‌ తర్వాత ఆగస్టు నుంచి పక్కాగా అమలు చేస్తామన్నారు. చెత్తవేస్తే రూ.500 జరిమానా విధించేలా చర్యలు చేపడతామన్నారు. అలాగే ఆక్సిజన్‌ కొనుక్కునే దుస్థితి రాకుండా చేసేందుకు అడవుల పరిరక్షణకు కఠిన చర్యలు అమలు చేస్తామన్నారు. పోడు వ్యవసాయానికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ‘ధూల్‌పేట్‌ విషయంలో నేను ఫెయిల్‌ అయ్యా. ఈసారి కచ్చితంగా వస్తా. అందరితో మాట్లాడి అక్కడి ప్రజల బాగోగులపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తా’అని కేసీర్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానమే గవర్నర్‌ చెప్పారు
గవర్నర్‌ ప్రసంగం పబ్లిక్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగంలా ఉందని కొంతమంది అన్నారని.. అలాంటి వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగిందేమీ లేదని సీఎం అన్నారు. కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆమోదించి, ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారో, ఆ పార్టీ మేనిఫెస్టో, అదే పాలసీ గవర్నర్‌ ప్రసంగంలో ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరిణతి స్థాయి పెరగాలన్నారు. బడ్జెట్‌ వస్తే అధికార పార్టీ వారు ఆహా అనడం, ప్రతిపక్షాలు చప్పగా ఉందని విమర్శించడం ఉండకూడదన్నారు.  

నీటి పారుదలే తొలి లక్ష్యం
రాష్ట్రప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్‌ అని, రానున్న మూడేళ్లలో 1.25 కోట్ల ఎకరాలకు నీరందించబోతున్నామని కేసీఆర్‌ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.99 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మొత్తంగా రూ.1.17లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా 1,330 టీఎంఎసీలను సంపూర్ణంగా వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. సంక్షేమం తన రెండో ప్రాధాన్యమన్నారు. మూడో ప్రాధాన్యంగా రోడ్లను తీసుకున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన అన్ని గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. పాత గ్రా>మపంచాయతీల్లో ఉన్న రోడ్లను బాగు చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లోఅన్ని విభాగాలను సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ఇస్తోందని, అదనంగా ఏమీ ఇవ్వడంలేదన్నారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా 3వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఇచ్చిందన్నారు. రీజినల్‌ రింగురోడ్డును మంజూరు చేసిందని కేసీఆర్‌ వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు
తెలంగాణ వచ్చే ఐదేళ్లలో సమకూర్చుకునే ఆదాయం, పెట్టే ఖర్చు రూ.10లక్షల కోట్లపైనే ఉంటుందని కేసీఆర్‌ వివరించారు. ఈ ఐదేళ్లలో రూ.2.40 లక్షల కోట్ల అప్పు పోగా, మరో 1.30 లక్షల కోట్లు వస్తాయన్నారు. అందులో నాలుగైదు లక్షల కోట్లు అభివృద్ధి పనులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. మార్చి 31 నాటికి మిషన్‌ భగీరథ పూర్తి చేస్తామన్నారు. ఉన్నత విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచుతామన్నారు. పాఠశాల విద్యలో గురుకులలాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలతోనూ మాట్లాడతామన్నారు. విద్యుత్తు సామర్థ్యాన్ని 28 వేల మెగావాట్లకు పెంచుకొని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఘనత సాధించనున్నామని కేసీఆర్‌ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ముందుగా సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, ఇతర పట్టణాలకు విస్తరించడం ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుందన్నారు. సీఎం ప్రసంగం అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. అనంతరం సభ గణాంకాలను వెల్లడించిన స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు.

ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు బెటర్‌
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘మంచి పథకం ఎవరు తెచ్చినా చరిత్రలో నిలిచిపోతారు. దాన్ని కాదనలేం. తుడిచేయలేం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. కచ్చితంగా అది చాలా మంచి పథకం. మాకు భేషజాలు లేవు. మంచిని మంచిగా అంగీకరించాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. అది వెరీగుడ్‌ స్కీం. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. అదే పథకాన్ని యధాతథంగా నాలుగున్నరేళ్లుగా కొనసాగించాం. ఇప్పుడు కూడా ముందుకు తీసుకుపోతాం. దానికి కొన్ని యాడ్‌ చేస్తున్నాం. వైఎస్‌ఆర్‌ 108 తెచ్చారు. మేము అమ్మ ఒడి పెట్టి, ఇంకా బలోపేతం చేసుకొని కొనసాగిస్తున్నాం. మీ పథకం ఇన్ఫీరియర్‌గా ఉంది. కాబట్టి మేం ఆయుష్మాన్‌ భారత్‌లో చేరబోమని ప్రధానికి చెప్పాను’అని కేసీఆర్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement