
అరచేతిలో అభ్యర్థుల చిట్టా
గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పూర్తి వివరాలతో ‘లోకల్ లీడర్’ యాప్‌ను రూపొందించినట్లు ఐటీఎస్ క్రియేటర్ సాఫ్ట్‌వేర్
పంజగుట్ట: గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పూర్తి వివరాలతో ‘లోకల్ లీడర్’ యాప్‌ను రూపొందించినట్లు ఐటీఎస్ క్రియేటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వాహకుడు మహ్మద్ అబుల్ ఉబేర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాప్‌కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వారి రాజకీయ ప్రస్థానం, గతంలో చేసిన సేవా కార్యక్రమాలూ ఇందులో ఉన్నాయన్నారు. దీంతో ప్రజలు ఉత్తమ నాయకుణ్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు.
స్థానికులు తమ ప్రాంతాల్లోని సమస్యలను ఫొటో తీసి ఇందులో అప్‌లోడ్ చేస్తే సంబంధిత ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్తుందని తెలిపారు. కార్పొరేటర్ సమస్యను పరిష్కరిస్తే తిరిగి ఫొటోను అప్‌లోడ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఈ యాప్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటుందన్నారు. యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్స్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీఎస్ క్రియేటర్ సంస్థ మార్కెటింగ్ ప్రతినిధులు మహ్మద్ ఫారూఖ్ హుస్సేన్, రామ్‌జీ లాల్ పాల్గొన్నారు.