ముప్పుతిప్పలు పెట్టి.. దొరికాడు!
స్థానికులకు చిక్కిన స్నాచర్
దూలపల్లి: మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగ స్నాచింగ్ చేశాడు. రెండు గంటల పాటు స్థానికులను ముప్పు తిప్పలు పెట్టి చివరకు చిక్కాడు. వివరాలు... దూలపల్లికి చెందిన చింతల సర్వయ్య ఎలక్ట్రీషియన్. ఇతనికి డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద వ్యవసాయ భూమి ఉంది. సోమవారం వరి కోత నిమిత్తం సర్వయ్య భార్య లలిత పొలానికి నడుచుకుంటూ వెళ్తోంది. తుమార్ చెరువు మీదుగా వెళ్తుండగా అప్పటికే కాపు కాసిన చైన్ స్నాచర్ వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని 4 తులాల పుస్తెల తాడు స్నాచింగ్ చేసేందుకు యత్నించాడు.
అప్రమత్తమైన లలిత చేతులతో తాడును పట్టుకుని కొద్దిసేపు నిలువరించింది. దీంతో స్నాచర్ లలితను కిందపడేసి కొద్ది దూరం ఇడ్చుకెళ్లాడు. అయినా ఆమె తాడును వదలకుండా ప్రతిఘటించింది. దీంతో స్నాచర్.. లలిత కుడి కంటిపై బలంగా గుద్ది పుస్తెల తాడుతో పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పనులు నిర్వహిస్తున్న మహిళలు వచ్చి స్నాచర్‌ను వెంబడిస్తూ పరిగెత్తారు. గ్రామ పొలిమేరలో మల్లన్న గుడి వద్ద ఉన్న అయ్యప్ప స్వాములు కూడా స్నాచర్ కోసం పరిగెత్తారు.
ఫోన్‌ల ద్వారా సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్నాచర్ దూలపల్లి శ్మశానవాటిక, గంగాస్థాన్, డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, చర్మాస్ రోడ్డుల గుండా పరిగెడుతూ తప్పించుకున్నాడు. ఎట్టకేలకు చెరువులోని ఓ పొదల మాటున నక్కడంతో గమనించిన స్వాములు యాదగిరి యాదవ్, దేవేందర్‌యాదవ్‌లు స్నాచర్‌ను పట్టుకున్నారు. స్నాచర్ వారి మీద తిరగబడడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. స్నాచర్ జేబులో ఉన్న నాలుగు తులాల పుస్తెల తాడును లలితకు అందజేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. స్నాచర్ గతంలో కూడా పలు స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.