కారు బీభత్సం
►ఆగిఉన్న వారిపైకి దూసుకొచ్చిన వాహనం
►ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
మహేశ్వరం: రోడ్డుపై అగి ఉన్న వారిపైకి కారు దూసుకు రావడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం శ్రీశైలం ప్రధాన రహదారిపైనున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు పంచాయతీ రాచులూర్ గేటు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన కొందరు పార్చునర్ కారులో శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. కారు రాచులూరు గేటు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌కు చెందిన ప్రతాప్‌పైకి దూసుకు వచ్చింది.
దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి ముందు అదే కారు పక్కనే బైక్‌పై ఆగి ఉన్న యాచారం మండలం కుర్మిద్దకు చెందిన అనెమోని కృష్ణను ఢీకొట్టింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం కారు పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన కృష్ణను బాలపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు.
దుర్మరణం చెందిన ప్రతాప్ మంఖాల్ పారిశ్రామికవాడలో పని చేయడానికి వారం రోజుల క్రితం రాయిచూర్ నుండి వచ్చాడు. గాయాలైన మరో వ్యక్తి తుమ్మలూరు గ్రామంలో ఉన్న అత్తగారింటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గుంటూరుకు చెందిన డ్రైవర్ రతన్‌బాబును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.