హైదరాబాద్ : యుసుఫ్‌గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ నాగరాజు భార్య జమున తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ హత్యకు సంబంధించి మరో మహిళ ప్రమేయం ఉందని ఆమె ఆరోపణలు చేసింది. ఐఏఎస్ కుమారుడు వెంకట్ ఈ హత్య చేయించి ఉంటాడని జమున తెలిపింది. మరోవైపు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
కాగా సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్ భూక్యా నాగరాజు (40)... భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్‌నగర్‌లోని జవహర్ నగర్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్ అపార్ట్‌మెంట్ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపోయాడు.
శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్‌మెంట్ పైకెళ్లి... ఓ మూటను కిందకు తీసుకొస్తుండగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌లోని ఓ వృద్ధుడు... ఎవరు నువ్వు... ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో ఆ వృద్ధుడు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మూటలో యువకుడి మృతదేహం కనుగొన్న పోలీసులు అతడిని నాగరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు.