
పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ఆకట్టుకొనే రూపం.. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం.. మాటకారితనం.. ఈ మూడు ఆ యువకుడికి పెట్టుబడి... కేవలం పదో తరగతి వరకు చదువుకున్న అతను పూటకో వేషం వేస్తాడు. ప్రేమపేరుతో అమ్మాయిలను వలలో వేసుకోవడం.. నమ్మినోళ్లను నట్టేట ముంచడం... ఇదీ ఇటీవల రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్లిన ఓ ఎన్‌ఆర్‌ఐ దంపతుల కారుకు తాత్కాలిక డ్రైవర్‌గా వెళ్లి నగలతో పాటు కారుతో ఉడాయించిన శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ గౌతంకృష్ణ అలియాస్ సూర్యతేజ(29) నైజం.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో శ్రీనివాస్‌రెడ్డి మోసాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఈ మోసాల్లో కుటుంబ సభ్యులంతా పాత్రధారులు కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు...
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కు చెందిన వ్యాపారి కొల్లి గాంధీ అల్లుడు నారాయణరెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గతనెల 17న పుష్కరస్నానాల కోసం లండన్ నుంచి నగరానికి వచ్చాడు. మరుసటిరోజు తమ స్విఫ్ట్ డిజైర్ కారు (ఏపీ28 డీఆర్ 4408)కు తాత్కాలిక డ్రైవర్‌గా జూబ్లీహిల్స్ గాయిత్రీహిల్స్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ గౌతంకృష్ణను నియమించుకొని రాజమండ్రి వెళ్లారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు నదిలో పుష్కర స్నానాలు చేసి వచ్చేలోగా శ్రీనివాస్‌రెడ్డి వారి నగలు, సెల్‌ఫోన్లతో పాటు కారుతో ఉడాయించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నగలను నిందితుడు బ్యాంకులో తనఖా పెట్టినట్లు తేలింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకోగా నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే విచారణలో శ్రీనివాస్‌రెడ్డి లీలలు ఒకొక్కటీ బయటపడుతున్నాయి. ఆరుగురు యువతులతో ప్రేమాయణం నడుపుతున్నట్టు తేలింది. అలాగే ఒకొక్కరికి ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని, ఒక్కొక్కరికి తాను అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఉంటున్నట్టు చెప్పి ప్రేమాయణం సాగిస్తునట్టు పోలీసులు గుర్తించారు.
నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఇతను దాదాపు 40 సిమ్‌కార్డులు మార్చినట్టు తేలింది. తాను దొంగిలించిన ఆభరణాలను కుటుంబ సభ్యుల ద్వారానే నగరానికి తరలించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులందరినీ పోలీసులు విచారిస్తున్నారు. నేరంలో వారందరి భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.