‘ఒక ఐడీని బ్లాక్ చేయిస్తే పది క్రియేట్ చేస్తా’
హైదరాబాద్ : సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఓ సైబర్ నేరగాడు సవాల్ విసురుతున్నాడు. అనేక మంది దేవుళ్లను కించపరుస్తూ ఫొటోలను పోస్ట్ చేస్తున్న ఇతగాడు ఒక ఐడీని బ్లాక్ చేయిస్తే పది సృష్టిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రకటిస్తున్నాడు. దీనిపై నగరవాసి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాగ్రాంలో ఉన్న అభ్యంతరకర పోస్టింగ్స్‌ను అబిడ్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారి శనివారం రాత్రి గుర్తించారు. వాటిని పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఓ వర్గాన్ని కించపరుస్తూ ప్రచారం చేస్తున్న వీటిని తొలగించాల్సిందిగా కోరుతూ ఇన్‌స్టాగ్రాం యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తక్షణం స్పందించిన వారు సదరు అభ్యంతరకర పోస్టుల్ని చేస్తున్న ఐడీని బ్లాక్ చేశారు.
మార్ఫింగ్ చేసిన ఆయా ఫొటోలను సైతం తీసేశారు. దీనిపై నగర వ్యాపారి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఓపక్క పోలీసుల విచారణ సాగుతుండగానే సైబర్ నేరగాడు మరింత బరి తెగించాడు. ఏకంగా 17 ఐడీలను క్రియేట్ చేసి వివిధ వర్గాలకు చెందిన దేవుళ్ళను కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. అందులో ఓ ఐడీ నుంచి ‘ఒక ఐడీని బ్లాక్ చేయిస్తే పది క్రియేట్ చేస్తా’ అంటూ సవాల్ కూడా విసిరాడు.
సదరు సైబర్ నేరగాడు బెంగళూరు కేంద్రంగా వీటిని పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత సున్నితమైన ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసులు తక్షణం స్పందించాలని, వీలైనంత త్వరలో సైబర్ నేరగాడు వినియోగిస్తున్న ఐడీలన్నింటినీ బ్లాక్ చేయించడంతో పాటు నిందితుడిని అరెస్టు చేయాలని ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని కోరుతున్నారు.