
‘అరచేతి’లో సీసీ కెమెరా దృశ్యాలు
‘హైదరాబాద్ కాప్’తో ఉపయోగాలు ఎన్నో
ఆవిష్కరణలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడి
విధుల్ని బట్టి సమాచారం అందుబాటు: సీపీ
సిటీబ్యూరో: ‘నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను ప్రతి అధికారి తన సెల్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా లభించనుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. సోమవారం నగర కమిషనరేట్‌లో ఈ యాప్‌ను ఆవిష్కరించిన డీజీపీ, ఆధునీకరించిన రిసెప్షన్ సెంటర్, పోలీసు క్యాంటిన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ‘ఈ యాప్ ద్వారా ప్రతి అధికారికీ చేతిలోనే సమీకృత సమాచారం లభిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా పోలీసులు తమ విధుల్ని వ్యూహాత్మకంగా నిర్వర్తించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలవుతుంది. దర్యాప్తు తీరుతెన్నులు, విధి విధానాలు సైతం అధికారుల్ని అడగాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు’ అని అన్నారు.
అవసరాల మేరకే సమాచారం
ఈ యాప్ ద్వారా దర్యాప్తునకు ఉపకరించే అనేక రకాలైన సమాచారాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. అయితే అందరికీ అన్ని వివరాలు తెలుసుకునే ఆస్కారం లేదు. యాప్‌ను వినియోగించే అధికారి హోదా, అతని విధి నిర్వహణ పరిమితులను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మాత్రమే సమాచారం యాక్సిస్ చేసే ఏర్పాట్లు చేశాం. నగర పోలీసు విభాగాన్ని స్మార్ట్ కాప్స్‌గా మార్చడంలో ఈ యాప్ ఓ మైలురాయి. పోలీసు అధికారుల్లో 90 శాతం మంది క్షేత్రస్థాయిలోనే ఉంటారు. పోలీసుస్టేషన్లలో ఉన్న వారందరికీ సైతం కంప్యూటర్లు అందించలేం. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్‌నే దర్యాప్తు ఉపకరణంగా మార్చుకోవచ్చు. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసుల కమిషనర్
అధికారుల ఉరుకులు పరుగులు...
నగర పోలీసులు ముందుగా అనుకున్న దాని ప్రకారం డీజీపీ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందే అనురాగ్ శర్మ కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి కమిషనర్ సహా అధికారులంతా తమ తమ ఛాంబర్స్‌లోనే ఉన్నారు. డీజీపీ రాక విషయం తెలిసి అంతా ఉరుకులు పరుగుల మీద కిందికి వచ్చారు. లిఫ్ట్ కోసమూ ఎదురుచూడకుండా మెట్ల వెంటే దిగివచ్చారు.
పోలీసు టెక్నాలజీలో సిటీ ఆదర్శం
రోమ్, లండన్, టోక్యో... ఇలా ప్రపంచంలోని ఒక్కో దేశం, నగరం ఒక్కో అంశానికి నాంది పలుకుతూ చరిత్రలో నిలిచిపోయి ఆద్శంగా మారాయి. పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మాత్రం హైదరాబాద్ సిటీ పోలీసులు ఇతర నగరాలు, రాష్ట్రాలను ఆదర్శంగా మారుతున్నారు. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ఆధునిక సౌకర్యాలతో పోలీసు విభాగం ‘హైదరాబాద్ కాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. - అంజనీకుమార్, అదనపు సీపీ
దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా..
ఈ యాప్ ద్వారా పోలీసు విభాగంలోని అన్ని స్థాయి అధికారులకు విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. అది ఏమాత్రం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. దీనికోసమే నిత్యం పక్కాగా ఆడెటింగ్ చేస్తున్నాం. ఏ అధికారి ఎప్పుడు, ఏ సమాచారాన్ని తనిఖీ చేశారు? ఏ మేరకు డౌన్‌లోడ్ చేసుకున్నారు? తదితర అంశాలను గమనించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. - కె.శ్రీనాథ్‌రెడ్డి, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్