
సీసీటీమ్స్‌కు స్పెషల్ క్లాస్
సిటీబ్యూరో: చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్)కు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పెషల్ డెరైక్షన్స్ ఇవ్వనున్నారు. ఆటోనగర్‌లో సోమవారం చైన్ స్నాచర్లపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆయా బృం దాలు కిందిస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిం చారు. చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించనున్నారు.
సీసీటీమ్స్ ఇచ్చిన సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని అందుకనుగుణంగా చైన్‌స్నాచర్ల వీరంగానికి అడ్డుకట్ట వేయడంపై సీవీ ఆనంద్ ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ తో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. ‘జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో కాల్పులు జరపొద్దు. అయితే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో చైన్‌స్నాచర్లను నిలువరించే క్రమంలో జరుగుతుంటా యి. ఎల్‌బీనగర్‌లోని ఆటోనగర్‌లో చైన్‌స్నాచర్లను పట్టుకునేందుకు సిబ్బంది చాలా ధైర్యం చేసింది’అని సీవీ ఆనంద్ అన్నారు.
మహిళల భద్రత కోసమే...
‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఛేజిం గ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఓయూ లో జరిగిన ఘటనలో సుమిత్రా అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన వివిధ ఘటనల్లో పదుల సంఖ్యలో మహిళలు గాయపడ్డారు. అందుకే చైన్‌స్నాచర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎల్‌బీనగర్ ఆటోనగర్‌లో చైన్‌స్నాచర్లను నిలువరించే క్రమంలో సీసీటీమ్స్ కాల్పులు జరిపాయి. ఇది లోకల్ ముఠా పనే, సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటామ’ని ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు.