
గల్లీమే సవాల్!
ఓపక్క ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్)తో పోలీసులనిరోధక చర్యలు...
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు
స్పాట్‌లు మారుస్తూ...రెక్కీలు నిర్వహిస్తూ కొత్త పోకడలు
పోలీసులకు ముప్పతిప్పలు
గురువారం సైబరాబాద్‌లో మూడు ఘటనలు
ఓపక్క ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్)తో పోలీసులనిరోధక చర్యలు... మరోపక్క దూకుడు తగ్గించకుండా తమ పంథా కొనసాగిస్తున్న చైన్‌స్నాచర్లు... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలా అసలైన ఆట మొదలైంది. పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని
‘అధిగమిస్తున్న’ గొలుసు దొంగలు కొత్త గల్లీలు వెతుక్కుంటూ తాపీగా తమ ‘పని’ కానిస్తున్నారు. పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్నారు. వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్‌లో గొలుసు దొంగలపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన రెండు రోజుల్లోనే స్నాచర్లు మళ్ళీ పంజా విసిరారు. గురువారం ఒక్కరోజే మల్కాజ్‌గిరి, మేడిపల్లి, సరూర్‌నగర్‌లలో మూడు స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.
సిటీబ్యూరో: నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం సహజం. ఇది అందరికీ తెలిసిందే. నగరంలో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న స్నాచింగ్ ఉదంతాలను పరిశీలిస్తే... దొంగలు కూడా పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచారని..వారిని పక్కాగా గమనిస్తూ అదును చూసి పంజా విసురుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
‘గస్తీ’కి తోడు సీసీటీమ్స్...
చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి కమిషనరేట్ పరిధిలో ఒకప్పుడు కేవలం గస్తీ బృందాలు మాత్రమే ఉండేవి. పోలీసుస్టేషన్ల వారీగా అక్కడక్కడ పికెట్లు ఏర్పాటు చేసే వారు. ఇటీవల స్నాచర్ల తీరు హింసాత్మకంగా మారుతుండడంతో ఏకంగా సీసీటీమ్స్‌ను రంగంలోకి దింపారు. మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసుకోవడంతో పాటు మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చి, తుపాకులూ అందించారు. ప్రస్తుతం కమిషనరేట్ మొత్తమ్మీద 55 బృందాలు పని చేస్తున్నాయి. ఈ రకంగా చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసులు అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.
పరిశీలిస్తూ ‘పని’ పూర్తి చేస్తూ...
పోలీసులు తీసుకుంటున్న చర్యల విషయం మీడియా ద్వారా ఇటు ప్రజలతో పాటు అటు స్నాచర్లకూ తెలుస్తూనే ఉంటోంది. దీంతో గొలుసు చోరులు ఎప్పటికప్పుడు తమ పంథాలను మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పోలీసులు గుర్తించిన...నిత్యం స్నాచింగ్స్ చోటు చేసుకునే హాట్‌స్పాట్స్ ఏరియాల్లోకి స్నాచర్లు అడుగుపెట్టడం లేదు. వీటిపై పోలీసు నిఘా ఉంటుందనే ఉద్దేశంతో గల్లీలనే మార్చి రెచ్చిపోతున్నారు. గస్తీ బృందాలు, పికెట్లు, సీసీటీమ్స్ లేని ప్రాంతాలను ఎంచుకుని, ముందుగా రెక్కీ చేస్తూ ఆపై టార్గెట్లను గుర్తించి పంజా విరుసుతున్నట్లు జరుగుతున్న ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. నేరగాళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసి, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న అధికారుల సంఖ్య వేళ్లపైనే లెక్కించవచ్చు. అయితే ప్రస్తుతం వీరిలో చాలా మంది క్షేత్రస్థాయిలో అందుబాటులో లేరు. సైబరాబాద్‌కు చెందిన అధికారులు ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలతో హైదరాబాద్ సహా అనేక చోట్లకు బదిలీ అయ్యారు. మరికొందరు లా అండ్ ఆర్డర్ విభాగానికి మారిపోయారు. క్రైమ్ విభాగానికి రావడం అంటే సమర్థులైన అధికారులంతా అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులే ఈ భావనకు ఊతం ఇస్తున్నాయి. వీటికి తోడు సిబ్బందితో ఇబ్బంది ఎలానూ ఉంది. ఇలా అనేక కారణాల నేపథ్యంలో నేరగాళ్ళకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడం సవాల్‌గా మారింది.
ప్రజలూ సహకరించాలి...
చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి ప్రజల సహకారం సైతం ఎంతో కీలకం. వీరిలో స్పందన, అవగాహన వస్తే తప్ప ఆశించిన ఫలితాలు రావు. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు, పోలీసులకు సహకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోనగర్ ఉదంతాన్నే తీసుకుంటే పారిపోతున్న స్నాచర్ల వెంట సీసీటీస్ సిబ్బందే వెళ్ళారు తప్ప అక్కడున్న ఏ ఒక్క సాధారణ పౌరుడూ ముందడుగు వేయలేదు. అదే జరిగితే ఆ స్నాచర్లు అక్కడే చిక్కడానికీ అవకాశాలు ఉండేవి. బాధితులు సైతం స్నాచింగ్ జరిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల సమాచారం ఇవ్వడం స్నాచర్లను పట్టుకోవడానికి ఉపకరించే అవకాశాల్లో కీలకమైందని మరువకూడదు.