అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం ద్వారా భారత్ గొప్ప మేలు చేసిందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. యోగా ద్వారా శరీరం, మనసు, ఆలోచనలు సమ్మిళిత శక్తిగా మారుతాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు.
అంతకు ముందు యోగా గురువు రవికిశోర్ పర్యవేక్షణలో రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో సుమారు గంటపాటు నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్‌ప్రీత్‌సింగ్, ఏపీ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ తదితరులు యోగా సాధన చేశారు.
యోగానే సంజీవని
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: సమస్త వ్యాధులకు యోగానే సంజీవని అని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో వైద్య ఆరోగ్యశాఖ-ఆయుష్ విభాగం ఏర్పాటుచేసిన యోగా శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌ఫీఎఫ్, ఆయుర్వేదిక్, హోమియపతిక్.. తదితర ప్రభుత్వ సంస్థలు, కళాశాలల నుంచి వచ్చిన సుమారు 2,500 మంది గంటపాటు యోగాసనాలను ప్రాక్టీస్ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. యోగా అనేది ఏ ఒక్క మతానికో సంబంధించినది కాదని, ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని చెప్పారు.
ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. యోగాను చేయడానికి ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలన్నారు.యోగా చేయడం ద్వారా శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, యునాని అదనపు డెరైక్టర్ డాక్టర్ యూసఫ్‌అలీ, ఆయుర్వేదం అదనపు డెరైక్టర్ డాక్టర్ విజయలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, విద్యాధర్,ఎంవీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
కేబీఆర్ పార్క్‌లో బాలకృష్ణ యోగా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో యోగాసనాలు నిర్వహించారు. యాడ్ లైఫ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా సాధన కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఇంతటి ప్రాచుర్యం రావడం దేశానికి, ఇక్కడి సాంస్కృతిక పరంపరకు దక్కిన గౌరవమని ఆయన అన్నారు.