సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్ ప్రభుత్వ అనుకూల భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు అతీతంగా లేదన్నారు. ప్రజాస్వామ్య ఉల్లంఘన బాహాటంగా జరుగుతుంటే గవర్నర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఫిరాయింపులపై స్పీకర్, గవర్నర్ స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. మంత్రులుగా కొనసాగడం అనైతికమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఇప్పటికైనా టీడీపీ సిగ్గుతెచ్చుకోవాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఫిరాయింపులను తప్పుబట్టారని గుర్తు చేశారు. గవర్నర్ నరసింహన్ పొగడ్తలు మాని ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
చెబితే కొడతారని చెప్పలేదా?
సీఎం కుర్చీని ఎమ్మెల్యే బాలకృష్ణ అవమానించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో సంప్రదాయాలను గౌరవించాలని అంబటి వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తీరు చూస్తే ఏపీలో పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. పక్కన ఉండి కూడా బాలకృష్ణను మంత్రులు, అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చెబితే కొడతారని చెప్పలేదా అని చురక అంటించారు. కొందరు టీడీపీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొన్నటివరకు నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని, తర్వాత ఆయనను దొడ్డిదారిన మంత్రిని చేశారని దుయ్యబట్టారు. బావమరిది మీద ప్రేముంటే చంద్రబాబు తప్పుకుని బాలకృష్ణను సీఎంను చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment