సాక్షి, అమరావతి: టీడీపీ మునిగిపోతున్న నావ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని చెప్పారు. చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను కుట్రపూరితంగా దెబ్బతీశారని విమర్శించారు. అంతేకాకుండా పథకం ప్రకారం ఎన్టీఆర్ కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేశారని గుర్తు చేశారు. లోకేశ్‌ను వారసుడిగా చేయాలనుకున్న వ్యూహం ఫలించలేదన్నారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన్నారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేశ్ భారీ దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్‌కు తెరతీశారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఒక్కొక్క చదరపు అడుగుకు రూ.11 వేలు ఖర్చు పెట్టారన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కి.మీ.కు రూ.42 కోట్లు ఖర్చు చేశారని.. వాటిపై విచారణ జరుగుతోందన్నారు. ఈడీ, సీఐడీ విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. బాబు నిప్పో, తుప్పో తేలబోతుందన్నారు.
పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు
పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి మోదీనే చెప్పారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు కార్యాలయాల్లో ఐదు రోజులపాటు ఐటీ సోదాలు జరిగాయన్నారు. వీటిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజధాని ఉద్యమంలో 45 మంది గుండెలాగి చనిపోయారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రాంతంలో 45 మంది చనిపోతే దేశ స్థాయిలో పెద్ద వార్త అవుతుందని అన్నారు. అక్కడ ఎవరు మరణించినా దండ వేస్తున్నారని, ఇలాంటి నీచ స్థితికి బాబు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ మునిగిపోతున్న నావ
Published Wed, Feb 12 2020 4:22 AM | Last Updated on Wed, Feb 12 2020 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment