
‘హైదరాబాద్ సిటీలో నానాటికీ కేసుల సంఖ్య తగ్గుతోంది. దీన్ని చూస్తుంటే అసలు తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను పోలీసులు కేసులుగా నమోదు చేస్తున్నారా? అనే సందేహం అనేక మందికి కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1 నుంచి కమిషనరేట్‌లో ఓ వినూత్న విధానం అమలు చేస్తున్నాం. పోలీసుస్టేషన్‌లో ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు కాకుంటే నేరుగా నా దగ్గరకే రావచ్చు. సివిల్ వివాదాలు కానివి, చట్ట పరిధిలో ఉన్న ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేయిస్తా. సీసీఎస్ లేదా స్థానిక పోలీసులతో దర్యాప్తు చేయిస్తూ... వీటిని పర్యవేక్షించేందుకు సీపీ ఆఫీస్ కేంద్రంగా సెంట్రల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం’ అని నగర ఇన్‌చార్జి కమిషనర్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రపంచ తెలుగు మహా సభల స్ఫూర్తితో పోలీసు విభాగం తొలిసారిగా తెలుగులో గణాంకాలు సిద్ధం చేశామని రానున్న రోజుల్లో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో రెండేళ్ళల్లో నగరంలో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. సిటీలో ఒక్క సైబర్ నేరాల మినహా మిగిలినవి తగ్గాయని, సరాసరిన 13 శాతం నేరాలు తగ్గినట్లు సీపీ వివరించారు.
మీకు పోలీస్ స్టేషన్‌లో ఏదైనా సమస్య ఎదురైందా...
మీరు ఇచ్చిన ఫిర్యాదును కేసుగా నమోదు చేయలేదా...అయితే వెంటనే మీరు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీ సమస్య సివిల్ వివాదం కాకుంటే..చట్ట పరిధిలో ఉంటే వెంటనే అక్కడే కేసు నమోదు అయ్యేలా చేస్తారు. మీకు న్యాయం జరిగేందుకు అన్నివిధాలా సహకరిస్తారు. ఇందుకోసం సీపీ ఆఫీస్ కేంద్రంగా సెంట్రల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది జనవరి 1వ తేదీ నుంచి పని చేస్తుంది. ఈ విషయాలను గురువారం ఇన్‌చార్జి సీపీ వీవీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే నేరాలకు సంబంధించిన వార్షిక గణాంకాలను ఆయన విడుదల చేశారు. నగరంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 13 శాతం తగ్గింది. లోక్ అదాలత్‌ల నేపథ్యంలో శిక్షల శాతం కూడా బాగా తగ్గింది. ఇక ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో పోలీసు విభాగం తొలిసారిగా తెలుగులో గణాంకాలు సిద్ధం చేసింది. వచ్చే రెండేళ్లలో నగరవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్‌చార్జి సీపీ వెల్లడించారు.
రాజీలతో తగ్గిన శిక్షల శాతం...
నగర కమిషనరేట్ పరిధిలో వివిధ నేరాల్లో శిక్షలు పడుతున్న శాతం 2017కు సంబంధించి కేవలం 24గా నమోదైంది. దీనికి భారీ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ పరిష్కారం కావడమే ఇందుకు కారణమన్నారు. వీలున్న ప్రతి కేసులోనూ పోలీసులు ఫిర్యాదుదారుడు–నిందితుల మధ్య సయోధ్యకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐదుసార్లు లోక్ అదాలత్‌లు నిర్వహించగా, 10,078 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 2016లో కేవలం 3373గా ఉన్న ఈ సంఖ్య గణనీయంగా పెరగడంతోనే శిక్షల శాతం తగ్గిందని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా 2012కు ముందు నమోదైన కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. వీటి సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలో 10,276గా ఉండగా... యూఐ కేసు మేళాల ఫలితంగా ప్రస్తుతం 5410కి తగ్గిందన్నారు.
రెస్పాన్స్ టైమ్‌లో రికార్డు...
ఓ ఉదంతానికి సంబంధించి ఫిర్యాదు వచ్చిన తర్వాత బాధితుడి వద్దకు చేరుకోవడానికి పట్టే సమయాన్ని రెస్పాన్స్ టైమ్‌గా పిలుస్తారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో ఇది నాలుగు నిమిషాలుగా ఉంది. అయితే సిటీలో 2017కు సంబంధించి 3.85 నిమిషాలుగా రికార్డు అయిందని, దీన్ని ఇంకా వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని కొత్వాల్ తెలిపారు. నగర వ్యాప్తంగా 1,66,149 సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామని, మరో రెండేళ్ళల్లో వీటి సంఖ్య 10 లక్షలకు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. హాక్–ఐని 6.5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని, దీన్ని బట్టి నగరంలో ఉన్న దాదాపు సగం కుటుంబాలు వినియోగిస్తున్నట్లుగా సీపీ వివరించారు.
దర్యాప్తు సమయాల తగ్గింపు...
నమోదైన కేసులను వీలైంనంత త్వరగా దర్యాప్తు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో 2016లో సరాసరిన ఓ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి 190 రోజులు పట్టేదని, దీన్ని ఈ ఏడాది 87 రోజులకు తగ్గించామన్నారు. ఓ ఠాణాలో సరాసరిన రెండు–మూడు నెలల్లో ఎన్ని కేసులు నమోదవుతాయో లెక్కించి ఆ సంఖ్యకు మించి పెండింగ్ కేసులు లేకుండా ఉండాలని ఆదేశించామన్నారు. ప్రతిపాదిత మెట్రో రైల్ నిర్మాణంలో ప్రస్తుతం 30శాతం వినియోగంలోకి వచ్చిందని, దీనికి భద్రత స్థానిక పోలీసులే చూస్తున్నారని, ప్రాజెక్టు 100 శాతం పూర్తయ్యే నాటికి 1800 మంది శాశ్వత ఉద్యోగులతో ప్రత్యేక విభాగం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనికి సంబంధించి 2–3 నెలల్లో పూర్తి రూపు వస్తుందని తెలిపారు.
సీపీ వర్సెస్ మీడియా...
వార్షిక సమావేశంలో ‘కెల్విన్ కేసు’కు సంబంధించి కొత్వాల్‌కు, విలేకరులకు మధ్య ఓ చిన్న ‘వార్’ జరిగింది. డ్రగ్స్ కేసు దర్యాప్తు చేసిన ఎక్సైజ్ సిట్ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అనేక మంది సినీ రంగానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి విచారించారు. ఎక్సైజ్ వారికి ముందే కెల్విన్‌ను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ప్రముఖుల పేర్లు ఎందుకు బయటకు రాలేదంటూ విలేకరులు కోరగా... కొత్వాల్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాము అంతకంటే ఎక్కువ కేసుల్నే నమోదు చేశామని, విచారణ వివరాలు వెల్లడిలో ఆచితూచి వ్యవహరిస్తామని కొత్వాల్ అన్నారు. ఓ సందర్భంలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు ‘సమాధానం చెప్పక్కర్లేదు’ అంటూ స్పందించారు. ఈ పరిణామాలతో కాస్సేపు యుద్ధ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment