‘విలీనోత్సవం’పై బీజేపీ ఏంచేస్తోంది: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులదే కీలకపాత్రని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బీజేపీ వాళ్లు కావాలంటే భైరాన్‌పల్లికి, గుండ్రాంపల్లికి వచ్చి తెలుసుకోవచ్చునని సవాల్ విసిరారు. హైదరాబాద్ విలీనాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏంచేస్తోందో చెప్పాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా యాదాద్రి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తామన్నారు. 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ తో యాత్ర ముగుస్తుందన్నారు.
పార్టీ నాయకులు కె.నారాయణ, పశ్యపద్మ, డా. సుధాకర్, ఇఫ్టూ నేత కందిమళ్ల ప్రతాపరెడ్డితో కలసి శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో వారోత్సవాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. విలీన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని, హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలని చాడ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.