'రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గం'
- జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
- నయీమ్ దందాపై సీబీఐ విచారణ జరిపించాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కరీంనగర్: దేశాన్ని కాపాడేందుకు రక్షణ రంగం ఎంతో పటిష్టంగా ఉందని, దీనిని కూడా బీజేపీ కాషాయూకరణ చేసి తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూడడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతసైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్‌ను బీజేపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రక్షణ రంగాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూడడం నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి మరిన్ని అధికారులు కల్పించి అక్కడి ప్రజలను స్వేచ్ఛగా ఉండే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడని, సంక్షేమ పథకాలకు నిధుల కోత విధిస్తూ సంపన్నులకు వేల కోట్ల రాయితీలు ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలు అమలుకావడం లేదన్నారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను మాయ చేస్తున్నాడని చాడ మండిపడ్డారు.
నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం సిట్ విచారణలో తేలిన నివేదికను, సీడీలను సీఎం తన వద్ద ఉంచుకుని తన అనుమాయులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. నయీమ్ అక్రమ దందా వ్యవహరంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని దళితులపై దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 28, 29, 30వ తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతం చేసి సమరశీల పోరాటాలకు ప్రజలను సమాయత్తం చేస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.