
సాక్షి, హైదరాబాద్ : అవిశ్వాసం అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని, రెండు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మగ్దూంభవన్‌లో శుక్రవారం చాడ విలేకరులతో మాట్లాడుతూ..హామీలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం బీజేపీ అని, అవిశ్వాసమంటే ఆ పార్టీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి 4 దాకా సీపీఐ రాష్ట్ర మహాసభలు ఆర్టీసీ కల్యాణమండపంలో జరుగుతాయని వెల్లడించారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏప్రిల్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతారన్నారు.