వర్గీకరణ కోసం ఢిల్లీలో ఉద్యమం : మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్యమించాలని తమ జాతీయ కమిటీ నిర్ణయించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
ఈ నెల 19 నుంచి వచ్చేనెల 12 వరకు ఢిల్లీలో వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వచ్చే నెల 12న మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 18న సీఎం కేసీఆర్ ఇంటి వరకు మాదిగల మహా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ మరో ప్రకటనలో తెలిపింది. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆందోళనలకు మద్దతివ్వాలని సీపీఐకి మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి మందకృష్ణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.