ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వీరోచిత సాయుధపోరాట చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టులను ఆయన దేశద్రోహులు అనడం హాస్యాస్పదమన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో తమకు పాత్ర, సంబంధం లేని విషయాన్ని బీజేపీ నాయకులు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఏకంగా తమ మాతృసంస్థ ఆరెస్సెస్‌ను నిషేధించిన నాటి హోంమంత్రి సర్దార్ పటేల్‌ను నిస్సిగ్గుగా అరువు తెచ్చుకుని పొగడడం వారి రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇంద్రసేనారెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నాటి స్వాతంత్ర సమరయోధుల నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. నాటి స్వతంత్ర పోరాటాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అనేకమంది తెలంగాణ కమ్యూనిస్టులను తామ్రపత్రాలతో సన్మానించిన విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. భూస్వామ్య, రాచరిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన నిజాం నవాబు సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి లొంగడం ఎంత వాస్తవమో, ఆ తర్వాత అదే ప్రభుత్వం ఆయనను రాజ్‌ప్రముఖ్‌గా గౌరవించడం అంతే వాస్తవమన్నారు.అంతేకాకుండా కమ్యూనిస్టులకు వెల్లువెత్తిన ఆదరణకు తట్టుకోలేక కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై సైన్యాన్ని ఉసిగొల్పడంతో ఆత్మరక్షణ పోరాటం జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కమ్యూనిస్టులు సాధించిన భారీ విజయం ప్రజా మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు.