చేసింది జానెడు.. చెప్పుకునేది బారెడు! : ఇంద్రసేనా
లెఫ్ట్‌పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చేసింది జానెడు.. చెప్పుకునేది బారెడు అన్నట్లుగా వారి వ్యవహారం ఉందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులు ఒక దశ వరకు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడారని, ఆ తర్వాత కలిసిపోయారని, సెప్టెంబర్ 17, 1948 తర్వా త హైదరాబాద్ విడిగా ఉంటే కమ్యూనిస్టు రాజ్యం వస్తుందని భారత్‌కు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. కమ్యూనిస్టులకు రజాకార్లతో, నిజాంతో కూడా సంబంధాలుండేవన్నారు.
కమ్యూనిస్టులపై భారత్‌లోని మిగ తా ప్రాంతంలో నిషేధముంటే ఇక్కడమాత్రం వారికి అనుకూలంగా నిజాం నిషేధం ఎత్తేశారన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, ప్రకాశ్‌రెడ్డి, దాసరి మల్లేశం తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్‌కు కన్నీటి గాథలు తెలియవా?
గతంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అంటూ కొండెక్కి జబ్బ లు చరుచుకున్న కేసీఆర్... అధికారంలోకి వచ్చాక దానిని నిర్వహించకపోవడం క్షమించరాని పాపమని ఇంద్రసేనారెడ్డి అన్నారు. నిజాం సమాధికి సలామ్ కొట్టి కీర్తిస్తున్న కేసీఆర్‌కు ఆనాడు రజాకార్లు ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన కన్నీటి గాథలు తెలియవా అని ప్రశ్నించారు. నిజాం హయాంలో దురాగతా లు, వాటికి వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పేందుకు సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న వరంగల్‌లో నిర్వహించే తిరంగాయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని ఆయన చెప్పారు.