సచివాలయాన్ని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏముంది?
సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఆగమేఘాలపై సచివాలయాన్ని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. వచ్చేనెల 1 నుంచి సెక్రటేరియట్‌ను ఖాళీ చేయడం మొదలు పెట్టి పదో తేదీ కల్లా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం హడావుడి ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. సచివాలయ తరలింపు ఆపకపోతే, ఈ అంశంపై కోర్టులో చోటుచేసుకునే పరిణామాలు గమనించి నవంబర్ 1న అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ భేటీని నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త సెక్రటేరియట్ కట్టాల్సిన అవసరం ఏముందని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఈ నిర్మాణానికి రూ. 350 కోట్ల అంచనా వ్యయమని చెబుతున్నా అది రూ. 2 వేల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. సచివాలయంలోని భవనాలను కూల్చడానికే రూ. 50 కోట్లు అవుతాయంటున్నారని, వేలం వేస్తే ఎదురు రూ. 50 కోట్లు ఇచ్చి భవనాల్లోని మెటీరియల్, ఫర్నీచర్‌ను ఎవరైనా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. హోంగార్డుల సమస్యలను పరిష్కారానికి సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.