ఉదండాపూర్ రిజర్వాయర్ మ్యాప్ పరిశీలిస్తున్న బృందం
జడ్చర్ల టౌన్/కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడే మంజూరయిందని, దానిని కేంద్రం గుర్తించకపోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా మంగళవారం సీపీఐ రాష్ట్ర బృందం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లయినా ఇప్పటికీ నీళ్ల పంచాయితీ తెగలేదని, ముఖ్యంగా కృష్ణా నికర జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పేరు మార్చినప్పటికీ, ప్రాజెక్ట్ మాత్రం పాతదేనని ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రాజెక్టుపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఏడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికీ ఉదండాపూర్ రిజర్వాయర్ పనులే పూర్తికాలేదని, ఇక లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ఎప్పుడు ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి పక్షపాత వైఖరి చూపిస్తున్నారని విమర్శించారు. కృష్ణానది 66 శాతం తెలంగాణలో, ఏపీలో 34 శాతమే ప్రవాహం ఉందని, కానీ, నీటి కేటాయింపుల్లో మాత్రం ఏపీకీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment