చైన్ స్నాచర్ చేతిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పి.సుమిత్ర
సాక్షి, హైదరాబాద్: భర్త శ్రీహరి పెరాలసిస్ వ్యాధితో మంచం పట్టాడు. పెద్ద కుమారుడు వంశీ డిగ్రీ పూర్తి చేసినా జాబ్ రాలేదు. చిన్న కుమారుడు నల్లకుంటలోని సెయింట్ పాట్రిక్స్ కాలేజీలో ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు కోమల్ కాచిగూడలోని నృపతుంగ డిగ్రీ కాలేజీ బీకామ్ ఫస్టియర్ చదువుతోంది. వీరందరికీ ఆర్ధికంగా అండదండలు ఇస్తున్న అమ్మ సుమిత్ర ఓ దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసింది.
సేవలు చేసే భార్య ఇక లేదన్న బాధతో శ్రీహరి... అలానాపాలనా చూసుకుంటున్న అమ్మ లేదన్న ఆవేదనతో పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇప్పటివరకు చైన్ స్నాచింగ్‌ల్లో బాధితులు గాయపడ్డ ఘటనలు ఉన్నా.. ఓ మహిళ మృతి చెందడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టపగలే సుమిత్ర మెడలో నుంచి బంగారు గొలుసు లాగడమే కాకుండా నెట్టేసి ఆమె మృతికి కారకుడైన దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
బర్కత్‌పురలో విషాదం..
హైదరాబాద్ బర్కత్‌పుర డివిజన్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన పి.శ్రీహరి, సుమిత్ర భార్యాభర్తలు. శ్రీహరి తార్నాకలోని ఎన్‌ఐఎన్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్)లో అటెండర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకి పెరాలసిస్ రావడంతో అతని స్థానంలో సుమిత్ర వెళ్లి పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ నెల 17న తార్నాకలోని ఎస్‌బీహెచ్ బ్యాంకులో తమ ఖాతాకు చెందిన వివరాలు తెలుసుకొని రావడానికి సుమిత్ర(45) చిన్నకుమారుడు సంజయ్‌తో కలసి బైక్‌పై వెళ్లింది.
తార్నాక నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి పల్సర్‌బైక్‌పై వచ్చి సుమిత్ర మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని.. బైక్‌పైనుంచి పక్కకు నెట్టేసి పారిపోయాడు. బైక్‌పై నుంచి సుమిత్ర కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సుమిత్ర కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అసెంబ్లీలో మహిళల భద్రత అంశాన్ని లెవనెత్తుతాం...
నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మహిళల భద్రతపై అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌లు అన్నారు. సుమిత్ర కుటుంబ సభ్యులను శనివారం వారు పరామర్శించారు. చైన్‌స్నాచర్లను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సుమిత్ర చైన్‌స్నాచింగ్‌కు గురై వారం రోజులు గడుస్తున్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.