జేజే యాక్ట్ అమలులో సవాళ్లు
- హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్
- 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోంది
- కేసుల విచారణకు న్యాయాధికారుల కొరత
- ఉన్న వారే జేజే, పోక్సో కేసులనూ విచారిస్తున్నారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: జువెనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్)–2015, లైంగిక నేరాల నుంచి పిల్లల సంరక్షణ చట్టం (పోక్సో యాక్ట్)–2012 అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో న్యాయాధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. 16–18 ఏళ్ల వారి నేరాల సంఖ్య పెరిగిపోతోందని, పోక్సో కేసులూ పెరుగు తున్నాయన్నారు. ఈ కేసులను విచారించేందుకు తగిన సంఖ్యలో న్యాయాధికారులు లేరని, ఉన్న వారే మిగిలిన కేసులతోపాటు జేజే, పోక్సో కేసుల ను విచారించాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు ఈ కేసుల పరిష్కారం విషయంలో న్యాయాధికారులకు సహాయ, సహకారాలు అందడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ ఆర్‌డీలో ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో సంయుక్త ఆధ్వర్యంలో జేజే, పోక్సో చట్టాలపై ఓ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ కీలకోప న్యాసం చేశారు. జువైనల్ కేసుల పరిష్కారంలో డాక్టర్లు, సైకాలజిస్టుల పాత్ర కీలకమని, అయితే సైకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
బాధిత పిల్లలకు న్యాయస్థానాల్లోని వాతావరణం వల్ల విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చేందుకే భయప డుతున్నారని, ఇది కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. బాధిత పిల్లలకు ఈ రకమైన భయాన్ని పోగొట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామని వివరించారు. నేరం చేసిన బాలల వయస్సు నిర్ధారణ న్యాయాధికారులకు పెద్ద సమస్య అని జస్టిస్ రంగనాథన్ తెలిపారు. డాక్టర్ల సాయం లేనిదే వయస్సు నిర్ధారణ సాధ్యం కాదని, వయస్సు నిర్ధారణ అయితే తప్ప కేసులో ముందుకెళ్లడం కుదరదని పేర్కొన్నారు. కార్యక్ర మంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకర నారాయణ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్ (మేనేజ్‌మెం ట్) డి.నాగార్జున, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు, పలువురు న్యాయాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుటుంబాల్లోనే ఎక్కువగా లైంగిక దాడులు: డీజీపీ
మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, బాలలపై లైంగిక దాడులకు సంబంధించి ఈ ఏడాది 464 కేసులు నమోదయ్యాయని, కుటుంబాల్లోనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా పిల్లల పాఠ్యపుస్తకాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ముద్రించి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సోనికుట్టీ జార్జ్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.