ఉద్రిక్తం
ఐకేపీ ఉద్యోగుల
‘చలో అసెంబ్లీ’ భగ్నం
పెద్ద సంఖ్యలో కార్యకర్తల అరెస్ట్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఐకేపీ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వందలాది మంది ఐకేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం నుంచే సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు వద్ద పోలీసు బలగాలను మోహరింపజేశారు. అనుమానం వచ్చిన వారినందరినీ తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ కార్యకర్తలు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఎంబీ భవన్‌లో గుమిగూడారు. 11 గంటల ప్రాంతంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వందలాది మంది ర్యాలీకి ఉపక్రమించగా...అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళా ఉద్యోగులను పోలీసులు ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. గంట పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అతి కష్టమ్మీద పోలీసులు ఆందోళనకారులను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ...
మరోవైపు అదే సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఎంబీ భవన్‌లో గుమిగూడిన ఐకేపీ ఉద్యోగులు సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి నేతృత్వంలో ఇందిరా పార్కు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా పోలీసులకు, ఐకేపీ ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ తోపులాటలో పుణ్యవతికి స్వల్ప గాయమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తుననినాదాలు చేయగా అతి కష్టమ్మీద వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
600 మంది అరెస్టు
చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ధర్నా చౌక్‌కు వస్తున్న ఐకేపీ ఉద్యోగులను పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్టాండ్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లలో దాదాపు 600 మందిని అరెస్టు చేసి బొల్లారం, రాంగోపాల్ పేట, గాంధీనగర్, ముషీరాబాద్ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. సోమవారం రాత్రి వరకు వారిని విడిచి పెట్టలేదు. అరెస్టయిన వారిలో సీఐటీయూ అధ్యక్షురాలు పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్, కార్యదర్శులు ఉమామహేశ్వర్‌రావు, ఆర్.వి. నరసింహారావు, ఐకేపీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. బొల్లారం పోలీసు స్టేషన్‌లో సేఫ్‌జోన్ కింద ఉంచిన దాదాపు 400 మంది యానిమేటర్లను సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జగన్ తెలిపారు.
అష్ట దిగ్బంధ ంలో ఇందిరా పార్కు
ఐకేపీ ఉద్యోగుల చలో అసెంబ్లీ నేపథ్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను పోలీసులు అష్టదిగ్బంధ ం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్యల నేతృత్వంలో వందలాది మంది పోలీసులు ఉదయం నుంచే మోహరించారు. ధర్నా చౌక్‌కు వచ్చే దారులన్నింటినీ ముళ్ల కంచెలు, బారీకేడ్‌లతో మూసేశారు. అనుమానితులను తనిఖీ చేశారు. .