ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 9 వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. ప్రభుత్వ శాఖలైన ఆర్ అండ్ బీ, మెట్రో వాటర్ బోర్డ్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ తదితర విభాగాలు ఏర్పాట్లు చేశాయి. మత్స్యశాఖ 2 లక్షల చేపపిల్లలను అందుబాటులో ఉంచింది. గతేడాదిలానే ఈ ఏడాదీ ఆస్తమా రోగులకు ఇబ్బంది కలగకుం డా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని స్వీకరించేం దుకు ఒకరోజు ముందుగానే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.
32 కౌంటర్లు..
ఈ సంవత్సరం కూడా 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాద పంపిణీ చేయనున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్‌రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. పోలీసుల రిహార్సల్స్ పూర్తయ్యాయి.
అందుబాటులో 5లక్షల వాటర్ బాటిళ్లు
మంచినీటి సరఫరా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఆధ్వర్యంలో 5 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. క్యూలో ఉండేవారికి కూడా మంచినీటిని సరఫరా చేయనున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు రోగులకు అల్పాహారాలను అందిస్తున్నాయి. వీటితో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ కూడా అల్పాహారాలు అందించనున్నట్లు తెలిసింది.
పార్కింగ్ ఏర్పాట్లివీ..
► పబ్లిక్ గార్డెన్స్ వైపు నుంచి తేలికపాటి వాహనాల్లో వచ్చే వారు తమ వాహనాలను నాంపల్లి లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ (బాలికల) ప్రాంగణంలో పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన అజంతా గేట్ ద్వారా గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. ఈ పార్కింగ్ ప్లేస్ నిండిపోతే వాహనాలను పబ్లిక్ గార్డెన్‌లోనే నిలుపుకోవాలి.
► బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు బాంబూ అడ్డా, మాలకుంట రోడ్ల వద్దే వాటిని దిగాలి. అక్కడి నుంచి కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు రావాల్సి ఉంటుంది. ఈ వాహనాలను గోషా మహల్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాలి.
► ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు తమ వాహనాలను ఇందిరా భవన్, గృహకల్ప, మేడాస్ హైస్కూల్ వద్ద పార్క్ చేసుకోవాలి. ఇవి నిండితే పబ్లిక్ గార్డెన్‌లో పార్కింగ్ కల్పించారు.
► తాజ్ ఐలాండ్, గాంధీభవన్ వైపు నుంచి వచ్చే వీఐపీలు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో తమ వాహనాలను నిలుపుకోవాలి. ప్రసాదం తీసుకున్న తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ క్లబ్ గేట్ ద్వారా బయటకు వెళ్లాలి.
► ఎంజే మార్కెట్ వైపు నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను జీపీవో మీదుగా మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జ్ నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను అలాస్కా, దారుస్సలాం, ఏక్ మినార్ మీదుగా పంపిస్తారు.
రూ. 15కు ఒక చేపపిల్ల
ముందుగా లైన్లలో వెళ్లేవారు మధ్యలో రూ. 15 చెల్లించి చేపపిల్లను కొనుగోలు చేసి చేప ప్రసాద స్వీకరణకు వెళ్లాలి. ఈ ఏడాది కూడా లక్షల్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని నిర్వాహకులు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు.