జాతీయ గీతాలాపనకు సీఎం గైర్హాజరు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం శాసనసభలో జరిగిన జాతీయ గీతాలాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. ఉదయం 9.04 గంటలకు స్పీకరు సభలో ప్రవేశించగానే అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి ప్రధాన ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు జాతీయ గీతమంటే కూడా గౌరవం లేదని, జాతీయ గీతాన్ని బాయ్‌కాట్ చేయడం సలక్షణం కాదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి అదే సమయంలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కూడా సభలో లేరు.
అంటే ఆర్థికమంత్రి యనమల పరిభాషలో ముఖ్యమంత్రికి, చీఫ్ విప్‌కు కూడా జాతీయ గీతమంటే గౌరవం లేదని అర్థమా? అని క్యాంటీన్‌లో కొందరు టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించుకున్నారు. ''వాస్తవంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టడం వల్ల ఆ సమయానికి అసెంబ్లీకి రాలేదు. ఈ విషయం తెలిసి కూడా యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ సభ్యుడు ఇలా వ్యాఖ్యానించి ఉండకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మా రాయి మాకే తగిలినట్లు అయింది...'' అని అధికార పక్షానికి చెందిన ఒక శాసనసభ్యుడు వాఖ్యానించారు.