
చిన్న పిల్లల చేతి ఘుమఘుమలు
ఘుమఘుమలాడే చికెన్ 65, చికెన్ ఫ్రై , ఫిష్ ప్రై , గోబీ మంచూరియా, పానీ పూరి, చాట్, వెజ్ బిర్యానీ, నూరూరించే ఐస్‌క్రీమ్‌లు.. ఇలా ఒకటేమిటి 220 రకాల వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఇవన్నీ పాకశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యమున్న వారు తయారు చేశారనుకుంటే పప్పులో కాలేసినట్లే! వారాసిగూడలోని నేతాజీ పబ్లిక్ స్కూల్ చిన్నారులు పాఠశాల ఆవరణలో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్-2015ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా చిన్నారులే వారి చిట్టిచేతులతో తయారుచేసుకు వచ్చిన వంటకాల రుచిని చూపించారు.
ఇక్కడ అందుబాటులో ఉంచిన రకరకాల వెరైటీలను అతిథులు రుచి చూసి వావ్ అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమల్లో ప్రత్యేకత సంతరించుకున్న కొన్ని రకాల వంటలు ఇక్కడ ప్రదర్శించి ఆకట్టుకున్నారు చిన్నారులు. ఇలా పాఠశాల ఆవరణ మ్తొతం రకరకాల వంటల ఘుమఘుమలతో నిండిపోయి సందడిగా మారింది. పాఠశాల చిన్నారులు, వారి తల్లిదండ్రులు కూడా వచ్చి వంటకాలను టేస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి మెట్రోపాలిటన్ జడ్జి అల్తాఫ్ హుస్సేన్ హాజరై.. పాఠశాల యాజమాన్యం కొత్త ఐడియాతో ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.