- చేరదీసిన ఆటోవాలా
- పాఠశాలను గుర్తుపట్టిన చిన్నారులు
మల్కాజిగిరి: పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను ఒక తల్లి నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్‌లో వదిలిపెట్టింది. బస్టాప్‌లో ఒంటరిగా ఉన్న చిన్నారులను చేరదీసిన ఆటోవాలా వారిని వారు చదివే పాఠశాల వద్దకు తీసుకొచ్చాడు. వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లబస్తీకి చెందిన అనిత తన పిల్లలు పుణ్యమ్మ(7), దీపిక(6)లతో కలిసి నివాసముంటున్నది. వేరే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కుత్బుల్లాపూర్ బస్టాప్‌లో మంగళవారం వదిలిపెట్టి కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు.
మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ శివాజీ మంగళవారం బస్టాప్‌లో ఉన్న చిన్నారులను గమనించి ఆరాతీశాడు. కేవలం వారి పేర్లు, మల్కాజిగిరి అని చెప్పడంతో వారిని ఆటోలో మల్కాజిగిరికి తీసుకొని వచ్చాడు. తన ఆటోలో గ్యాస్ అయిపోవడంతో గ్యాస్ నింపుకోవడానికి మౌలాలికి వెళ్లుతుండగా చిన్నారులు తాము చదివే తాళ్లబస్తీలోని ప్రాధమిక పాఠశాలను గుర్తుపట్టారు. దీనితో ప్రధానోపాధ్యాయుడు హనుమంతరెడ్డి వారిని గుర్తించి వాళ్ల అమ్మ గురించి వాకబు చేయడంతో ఖాళీ చేశారని తెలియడంతో ఆల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి భవానీకి సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం సహకారంతో చిన్నారులను తీసుకొని వచ్చి ఆల్వాల్‌లోని లోని చిల్డన్ర్‌హోంలో రక్షణ కల్పించామని తెలిపారు.