- ‘గ్రేటర్’లో ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు
- 24 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు..
- ఓటు వేయనున్న 74.56 లక్షల ఓటర్లు
- అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి
- రంగంలో తొమ్మిది {పధాన పార్టీలు
- మొదలైన ఎన్నికల వేడి
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మహానగర పరిధిలో ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలు, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరో 55 రోజుల్లో పోలింగ్ జరగనుంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
సాక్షి, సిటీబ్యూరో: మహానగరం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కౌంట్‌డౌన్‌కు తెరతీసింది. ఏకకాలంలో పార్లమెంటు, అసెం బ్లీలకు ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. గ్రేటర్ పరిధిలో ఈసారి మొత్తంగా 74,55,934 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 39,96,827, మహిళలు 34,59,107 మంది ఉన్నారు.
ప్రధాన నగరంలో 15 శాసనసభ స్థానాలకు, శివార్లలో 9 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదేరోజు ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి స్థానాలు పూర్తిగా గ్రేటర్ పరిధి లోనివే. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, నల్లగొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో గ్రేటర్ శివార్లు పాక్షికంగానే ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, ఎంఐఎం, టీఆర్‌ఎస్, లోక్‌సత్తా, వామపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మహానగరంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. గెలుపుగుర్రాల అన్వేషణ, నియోజకవర్గాల వారీగా ఎన్నికల మేనిఫెస్టోలు, హామీల రూపకల్పనలో పార్టీలు నిమగ్నమయ్యాయి.
‘కోడ్’ కూసింది
ఎన్నికల షెడ్యూలు విడుదలయిన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల బదిలీలతోపాటు నూతన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. నిబంధనావళి అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి లేకుండా బదిలీలు చేయడానికి వీల్లేదు.
అత్యధికం.. అత్యల్పం ఇక్కడే
గ్రేటర్ పరిధిలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ శాసనసభా నియోజకవర్గంలో 5,58,742 మంది ఓటర్లు ఈ సారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యల్పంగా చార్మినార్ శాసనసభ స్థానంలో 1,72,566 మంది ఓటు వేయనున్నారు.
నేడు సమీక్ష..
గ్రేటర్‌లో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక కమిషనర్ రాహుల్ బొజ్జా గురువారం సమీక్షించనున్నారు. బుధవారమే ఆయన జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక కమిషనర్(ఎన్నికలు)గా బాధ్యతలు చేపట్టారు.