సిటీ పోలీసు యాక్ట్‌కు ‘కొత్త కోరలు’
సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సవరణలు
ముసాయిదాకు తుది రూపునిస్తున్న ప్రత్యేక కమిటీ
లోపాలకు తావు లేకుండా పక్కాగా రూపకల్పన
⇒ఏటీఎం కేంద్రాల వద్ద పక్కాగా సెక్యూరిటీ గార్డుల్ని ఏర్పాటు చేయమని పోలీసులు మొత్తుకుంటున్నా ఫలితం ఉండటంలేదు.
⇒నడిరోడ్డుపై మద్యం తాగుతూ ఆకతాయిలు స్థానికులు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్నా కేవలం ఫైన్‌తో సరిపెట్టాల్సిందే.
⇒నలుగురిలో అభ్యంతరకరంగా, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ఠాణాకు తీసుకొచ్చి నామమాత్రపు చర్యలతో సరిపెట్టాల్సిందే.
ఇటు ఐపీసీ, అటు ఇతర చట్టాల పరిధిలోకి రాని ఇలాంటి అంశాలెన్నో సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన చట్టం లేకపోవడంతో ఇలాంటి సమస్యాత్మక వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకొని మళ్లీ మళ్లీ సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ తరహా అనేక ఇబ్బందులకు పరిష్కారంగా నగర పోలీసు విభాగం హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్‌ను సమూలంగా సవరిస్తోంది. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటైన ఓ కమిటీ ఇటు పోలీసు, అటు న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చిస్తోంది.
ఫస్లీ టు సీపీ యాక్ట్...
ప్రస్తుతం నగర పోలీసు విభాగం అనుసరిస్తున్న సిటీ పోలీసు యాక్ట్‌కు మూలం నిజాం హయాంలో అమలులోకి వచ్చిన ఫస్లీ. 1955 అక్టోబర్ 11 నుంచి అమలులోకి వచ్చిన సిటీ పోలీసు కమిషనరేట్ కోసం ఈ ఫస్లీలో కొన్ని స్వల్ప మార్పు చేర్పులు చేశారు. అందులో భాగంగా అప్పట్లో సిటీలో ఉన్న సమస్యల ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కమిషనర్‌కు ఇస్తూ పొందుపరిచారు. ఇలాంటి నేరాలు సీపీ యాక్ట్‌లో 31 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం జరిమానా మాత్రమే విధించే అవకాశం ఉన్న కాంపౌండబుల్ అఫెన్సులే. జరిమానాలు సైతం నామమాత్రం ఉండటంతో పదేపదే అదే తరహా నేరాలు చేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. రహదారులపై ధర్నాలు చేస్తూ ట్రాఫిక్‌తో పాటు సామాన్యులకూ ఇబ్బందులు సృష్టించిన వారి పైనా కఠిన చర్యలు తీసుకోలేకపోవడమే దీనికి నిదర్శనం.
16 ఏళ్లలో ఎన్నో మార్పులు...
నగర పోలీసులకు శిక్షణ సమయంలోనే పోలీసు యాక్ట్‌పై అవగాహన కల్పిస్తారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా సీపీ యాక్ట్‌లో మార్పు చేర్పులు చేయాల్సి ఉన్నా... ఇంతకాలం అది జరగలేదు. అయితే 2000 సంవత్సరం తరవాత దేశ వ్యాప్తంగా చట్టాల్లో అనేక మార్పులు, సవరణలు జరిగాయి. నిర్భయతో సహా అనేక కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. వీటి పరిధిలోకీ రాకుండా సామాన్యులకు ఇబ్బందులకు కలిగించే సమస్యలు ఉన్నట్లు నగర పోలీసు అధికారులు గుర్తించారు. దీని కోసమే సీపీ యాక్ట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సమకాలీన అవసరాలకు తగ్గట్టు...
ఈ కమిటీ సీపీ యాక్ట్‌తో పాటు ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఇబ్బందుల్ని పలు కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ఈ చట్టంలో ప్రస్తుత కాలం, అవసరాలను అనుగుణంగా లేని పలు అంశాలను తొలగించాలని భావిస్తోంది. 1955 తర్వాత అమలులోకి వచ్చిన చట్టాలు, సవరణలతో పాటు సమాజంలో పెరిగిన సవాళ్లను పరిగణలోకి తీసుకుంటోంది. ఆ అంశాలన్నింటి పైనా చర్యలు తీసుకునేలా సీపీ యాక్ట్ సవరణ ముసాయిదా రూపొందిస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న సవరణలతో కూడిన ముసాయిదాను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం అవసరమైన మార్పు చేర్పులు చేసి శాసస సభ ద్వారా సవరణలకు ముద్ర వేయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జీవో విడుదల చేయడం ద్వారా సర్కారు సవరించిన సీపీ యాక్ట్‌ను అమలులోకి తీసుకురానున్నారు.