సిటీ టు మేడారం బస్సులు, రైళ్లు
మేడారం మహాజాతర వచ్చేసింది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు కన్నుల పండువగా జరుగనుంది. జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. మేడారం జాతరతో పాటు హన్మకొండ వేయిస్తంభాలగుడి, ఫోర్ట్ వరంగల్, అద్భుతమైన లక్నవరం సరస్సు, మనోహరమైన రామప్ప టెంపుల్ తదితర ప్రాంతాలను కూడా సందర్శించి తిరిగి నగరానికి చేరుకోవచ్చు.
అతి పెద్ద అరణ్యంలో కొలువుదీరిన వనదేవతల సందర్శన ఒక గొప్ప అనుభూతి. వరంగల్ జిల్లాలోని మేడారం జాతర సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
- సాక్షి, సిటీబ్యూరో
⇒ మహాజాతరకు వెళ్లేందుకు నగరం నుంచి ఏర్పాట్లు
⇒ ఈ నెల 17 నుంచి 20 వరకు జాతర
⇒ ప్రతి అరగంటకో ప్రత్యేక బస్సు
⇒ వివిధ ప్రాంతాల నుంచి నడుపనున్న ఆర్టీసీ
⇒ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
బస్సుల వివరాలివీ...
♦ మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
♦ మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌షుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి.
♦ మేడారం వెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేందుకు కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
♦ ఈ నెల 17 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున నడుపనున్నారు.
♦ లక్షల సంఖ్యలో భక్తులు తరలివెళ్లనున్న దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ చెప్పారు.
♦ నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాల నుంచి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
♦ కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది.
♦ జాతర బస్సులకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910,040-27802203, 738201686 నెంబర్‌లకు సంప్రదించవచ్చు.
ఇలా వెళ్దాం...
హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా మేడారం చేరుకొనేందుకు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో అయితే సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రైవేట్ వాహనాల్లో అయితే 6 గంటలకు పైగా సమయం పట్టవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరి హన్మకొండ, వరంగల్, ములుగు, పస్రా,తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటారు. పస్రా నుంచి రెండు రహదారులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. ప్రైవేట్ వాహనాలను మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, ఊరట్టం మీదుగా మేడారంకు తరలిస్తున్నారు.
ఈ మార్గంలో వాహనాల రద్దీ కారణంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్క నార్లాపూర్-ఊరట్టం మధ్యన ఉన్న 5 కిలోమీటర్ల దూరానికే ప్రస్తుతం అరగంట నుంచి గంట వరకు సమయం పడుతుంది. 17వ తేదీ నుంచి భక్తుల రద్దీ బాగా పెరగనుంది. అమ్మవార్లు గద్దెపైకి చేరుకొనే రోజు నాటికి ఈ రెండు మార్గాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. దీంతో మరింత సమయం పట్టవచ్చు.
ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్టాపులు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో జంపన్నవాగుకు వెళ్లవచ్చు. అమ్మవార్ల గద్దెలు కూడా అంతే దూరంలో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అమ్మవార్లను సందర్శించుకోవచ్చు.
వీటినీ సందర్శించండి..
వైభవోపేతమైన మేడారం మహాజాతరతో పాటు భక్తులు మరికొన్ని చారిత్రక ప్రదేశాలను కూడా ఈ పర్యటనలో సందర్శించవచ్చు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌తో పాటు, భద్రకాళి దే వాలయానికి వెళ్లవచ్చు. ములుగు నుంచి మేడారం వెళ్లే మార్గంలో జంగాలపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంటుంది. కాకతీయుల నాటి ఈ అతి పెద్ద సరస్సును వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడ ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకొనేందుకు నీటిపైన ఉన్న వేలాడే వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక జంగాలపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుతమైన పర్యాటక ప్రాంతం రామప్ప టెంపుల్. ఇది కాకతీయుల నాటి శివాలయం. విశాలమైన రామప్ప చెరువు, చుట్టూ అడవి, చెరువు ఒడ్డున కట్టించిన గుడి. ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతినిస్తాయి.
ఆకాశ మార్గాన పయనానికి రాని అనుమతి?
గగనతల ప్రయాణం ద్వారా మేడారం వెళ్లాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. బేగంపేట్, లక్నవరం, వరంగల్ నుంచి హెలికాప్టర్ సందర్శన ప్రారంభం కావాలి. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇండ్‌వెల్ ఏవియేషన్ వారికి అనుమతులే రాలేదు. దీంతో ఇండ్‌వెల్ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక యాత్రికుల్లోనూ దీనిపై సందిగ్ధత వీడలేదు.
ప్రత్యేక రైళ్లు....
♦ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపనుంది.
♦ సికింద్రాబాద్-వరంగల్ (07007/07008) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
♦ తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.45 కు వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 9. 30కు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.
హైదరాబాద్-మేడారం బస్సు చార్జీల వివరాలు...
బస్సు పెద్దలకు పిల్లలకు
ఏసీ 552 432
సూపర్ లగ్జరీ 447 247
ఎక్స్‌ప్రెస్ 337 187