RTC special buses
-
హైదరాబాద్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణాను వినియోగిస్తే స్టేడియానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. అభిమానుల కోసం మెట్రో రైల్, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 25న ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు ఉప్పల్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టింది. స్టేడియం మెట్రో స్టేషన్ నుండి ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అమీర్‌పేట్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సేవ సమయంలో, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతిస్తారు. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరుస్తారు. మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే లేదా కనీసం రిటర్న్ టిక్కెట్లను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ప్రయాణ సౌలభ్యం కోసం, క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డులను ఉపయోగించాలని కోరారు. టీ–20 మ్యాచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న టీ–20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, మెహిదీపట్నం, కోఠి, ఘట్కేసర్ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుపనున్నారు. (క్లిక్ చేయండి: టి-20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు) -
ప్రత్యేక బాదుడు
సాక్షి, అమరావతిబ్యూరో: సంక్రాంతి పండక్కి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకూ కృష్ణా రీజియన్ పరిధిలోని విజయవాడ నుంచి అన్ని సెక్టార్లకు 829 అదనపు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రద్దీగా ఉన్న ప్రాంతాలకు అవసరాన్ని బట్టీ సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఆయా సర్వీసులు నడుస్తాయి. డిమాండ్ బారెడు ఈనెల 12వ తేదీ నుంచి విద్యాసంస్థలకు సెలవులు. జన్మభూమి ఈనెల 11వ తేదీతో ముగుస్తుండటంతో 12 నుంచి సెలవులు ప్రకటించారు. రాజధానిలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అధికారులు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్తారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఎనిమిది రోజుల పాటు ప్రధాన రూట్లలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. 8 రోజులు : 829 ప్రత్యేక బస్సులు పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు బుధవారం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎనిమిది రోజుల పాటు 829 బస్సులు ప్రత్యేకంగా> నడుపుతారు. బుధవారం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో 106 బస్సులు, 11న 111 బస్సులు, 12న 112 బస్సులు, 14న 125 బస్సులు, 15న 125 బస్సులు, 16న 125 బస్సులు, 17న 125 బస్సులు తిప్పనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా దోచేస్తున్నారు.. పండగ సమయాల్లో తిప్పే ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ బస్సుల్లో విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.1,000 టికెట్ ఉంటే, ప్రత్యేక బస్సులో మాత్రం రూ.1,500 వసూలు చేస్తున్నారు. దీనివల్ల పండగ సమయాల్లో ఆర్టీసీకి కాసులు పంట పండుతోంది. ప్రత్యేక సర్వీసుల్లో ఎక్కువ భాగం నాన్ ఏసీ బస్సులే నడుపుతారు. ఏసీ బస్సుల కొరత ఉండడంతో పది బస్సులు మాత్రమే తిప్పనున్నారు. అటు ప్రైవేట్ బస్సుల్లో సా«ధారణ రోజుల టికెట్ కంటే నాలుగు రెట్లు అదనంగా చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు. డొక్కు బస్సులతో అవస్థలు పండుగ సందర్భాల్లో ఆర్టీసీ తిప్పే వాటిలో ఎక్కువగా డొక్కు బస్సులే ఉంటున్నాయి. కృష్ణా రీజియన్ పరిధిలోని బస్సుల సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో సరైన సౌకర్యాలు లేని బస్సులనే తిప్పుతున్నారు. వీటివల్ల రాత్రివేళ ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో చలిగాలుల తీవ్రతకు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. -
16న కైట్ ఫెస్టివల్..
సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్రం టెంపుల్ సిటీలో ఈ నెల 16న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దేవస్థానం సమీపంలో ఉన్న విశాలమైన పెద్దగుట్టపై నిర్వహించే ఈకార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులతోపాటు టూరిజం శాఖ అధికారులు హాజరుకానున్నారు. దాదాపు 19దేశాల పతంగులు ఎగురవేయడానికి ప్రత్యేక నైపుణ్యం కలిగిన 32మంది వస్తున్నారు. ఈ వేడుకను తెలంగాణ పర్యాటక శాఖ, ఆగాఖాన్ అకడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక ఏర్పాట్లు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్‌ను ఈసారి యాదాద్రి పుణ్యక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నారు.దీనికి గాను నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం నలుమూలల నుం వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జనగాం, కూకట్పల్లి, కుషాయిగూడ, రాయగిరి, సికింద్రాబాద్‌ల నుంచి బస్సులు నడుపుతారు. అలాగే మంచినీరు, టెంట్లు, భోజన, రవాణా వసతి ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని బుధవారం యాదాద్రిలో ప్రత్యేక పతంగుల ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి.. కైట్ ఫెస్టివల్‌ను 16వ తేదీ ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, స్కాట్లాండ్, యూకే, దక్షిణకొరియా, శ్రీలంక, ఇటలీ, ఉక్రెయిన్, వియత్నాం, పోలాండ్, మలేషియా, కంబోడియా వంటి 19 దేశాల నుంచి 32 మంది పాల్గొంటారు. విదేశీయులతోపాటు భక్తులు, యాత్రికులు సుమారు 2000 మంది పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. కైట్ ఫెస్టివల్‌తో ప్రత్యేక గుర్తింపు యాదాద్రి క్షేత్రంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. దీని ద్వారా యాదాద్రి ప్రాముఖ్యత మ రింత విశ్వవ్యాప్తమవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించే ౖMðట్ ఫెస్టివల్ గ్రామీణప్రాంతానికి రావడం ఎంతో హర్షనీయం. స్థానికులు పెద్ద ఎత్తున ఈపండుగలో పాల్గొనాలి. – గొంగిడి సునీత, ప్రభుత్వ విప్ దేశంలోనే మొదటిసారి యాదాద్రి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం. అందుకే దేశంలోనే మొదటి సారిగా కైట్ ఫెస్టివల్‌ను యాదాద్రిలో నిర్వహిస్తున్నాం. ఫెస్టివల్లో పాల్గొనే వారికి సంస్థ తరఫున భోజనం, మంచి నీరు, బిస్కట్లు, తిను బండారాలు అందజేస్తాం. సేద తీరడానికి ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. -
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
♦ ఆగస్టు 12వ తేదీ నుంచి 23 వరకు ♦ ఆన్లైన్లో టిక్కెట్ల బుకింగ్ ♦ హైదరాబాద్ జోన్ ఆర్టీసి ఈడీ వేణు తాండూరు: కృష్ణ పుష్కరాల కోసం 1,100 ప్రత్యేక బస్సులు నడపునున్నట్టు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డి.వేణు వెల్లడించారు. తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాలనుంచి 200, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి 900 బస్సులను పుష్కరాలకు నడపనున్నట్టు వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిని బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అయితే పుష్కర ఘాట్ల వరకు చేరుస్తాయని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బీచ్పల్లి, రంగాపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లి, సోమశిలలోని పుష్కర ఘాట్లకు బస్సులు తీసుకెళ్తాయి. విజయవాడ వరకు 50 బస్సులు వేశారు. ఏసీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ తదితర బస్సుల్లో ప్రయాణించేందుకు ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. 50మంది ప్రయాణికులు కలిసి వస్తే వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు అదనపు చార్జీలు ఉంటాయని, ఎంత అనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. -
ఎంసెట్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ జేఎండీ రమణారావు తెలిపారు. ఆదివారం జరిగే ఈ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,538 బస్సులు అందుబాటులో ఉంచనున్నట్లు రమణారావు పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ 1,063, వరంగల్‌లో 105, నిజామాబాద్‌లో 90, మెదక్‌లో 130, మహబూబ్‌నగర్‌లో 35 బస్సులను నడుపుతామని ఆయన వివరించారు. -
సిటీ టు మేడారం బస్సులు, రైళ్లు
మేడారం మహాజాతర వచ్చేసింది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు కన్నుల పండువగా జరుగనుంది. జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. మేడారం జాతరతో పాటు హన్మకొండ వేయిస్తంభాలగుడి, ఫోర్ట్ వరంగల్, అద్భుతమైన లక్నవరం సరస్సు, మనోహరమైన రామప్ప టెంపుల్ తదితర ప్రాంతాలను కూడా సందర్శించి తిరిగి నగరానికి చేరుకోవచ్చు. అతి పెద్ద అరణ్యంలో కొలువుదీరిన వనదేవతల సందర్శన ఒక గొప్ప అనుభూతి. వరంగల్ జిల్లాలోని మేడారం జాతర సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ⇒ మహాజాతరకు వెళ్లేందుకు నగరం నుంచి ఏర్పాట్లు ⇒ ఈ నెల 17 నుంచి 20 వరకు జాతర ⇒ ప్రతి అరగంటకో ప్రత్యేక బస్సు ⇒ వివిధ ప్రాంతాల నుంచి నడుపనున్న ఆర్టీసీ ⇒ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు బస్సుల వివరాలివీ... ♦ మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ♦ మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌షుఖ్‌నగర్ బస్స్టేషన్లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి. ♦ మేడారం వెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేందుకు కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ♦ ఈ నెల 17 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున నడుపనున్నారు. ♦ లక్షల సంఖ్యలో భక్తులు తరలివెళ్లనున్న దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ చెప్పారు. ♦ నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాల నుంచి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ♦ కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ♦ జాతర బస్సులకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910,040-27802203, 738201686 నెంబర్లకు సంప్రదించవచ్చు. ఇలా వెళ్దాం... హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా మేడారం చేరుకొనేందుకు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో అయితే సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రైవేట్ వాహనాల్లో అయితే 6 గంటలకు పైగా సమయం పట్టవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరి హన్మకొండ, వరంగల్, ములుగు, పస్రా,తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటారు. పస్రా నుంచి రెండు రహదారులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. ప్రైవేట్ వాహనాలను మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, ఊరట్టం మీదుగా మేడారంకు తరలిస్తున్నారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ కారణంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్క నార్లాపూర్-ఊరట్టం మధ్యన ఉన్న 5 కిలోమీటర్ల దూరానికే ప్రస్తుతం అరగంట నుంచి గంట వరకు సమయం పడుతుంది. 17వ తేదీ నుంచి భక్తుల రద్దీ బాగా పెరగనుంది. అమ్మవార్లు గద్దెపైకి చేరుకొనే రోజు నాటికి ఈ రెండు మార్గాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. దీంతో మరింత సమయం పట్టవచ్చు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్టాపులు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో జంపన్నవాగుకు వెళ్లవచ్చు. అమ్మవార్ల గద్దెలు కూడా అంతే దూరంలో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అమ్మవార్లను సందర్శించుకోవచ్చు. వీటినీ సందర్శించండి.. వైభవోపేతమైన మేడారం మహాజాతరతో పాటు భక్తులు మరికొన్ని చారిత్రక ప్రదేశాలను కూడా ఈ పర్యటనలో సందర్శించవచ్చు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌తో పాటు, భద్రకాళి దే వాలయానికి వెళ్లవచ్చు. ములుగు నుంచి మేడారం వెళ్లే మార్గంలో జంగాలపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంటుంది. కాకతీయుల నాటి ఈ అతి పెద్ద సరస్సును వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడ ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకొనేందుకు నీటిపైన ఉన్న వేలాడే వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక జంగాలపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుతమైన పర్యాటక ప్రాంతం రామప్ప టెంపుల్. ఇది కాకతీయుల నాటి శివాలయం. విశాలమైన రామప్ప చెరువు, చుట్టూ అడవి, చెరువు ఒడ్డున కట్టించిన గుడి. ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతినిస్తాయి. ఆకాశ మార్గాన పయనానికి రాని అనుమతి? గగనతల ప్రయాణం ద్వారా మేడారం వెళ్లాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. బేగంపేట్, లక్నవరం, వరంగల్ నుంచి హెలికాప్టర్ సందర్శన ప్రారంభం కావాలి. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇండ్‌వెల్ ఏవియేషన్ వారికి అనుమతులే రాలేదు. దీంతో ఇండ్‌వెల్ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక యాత్రికుల్లోనూ దీనిపై సందిగ్ధత వీడలేదు. ప్రత్యేక రైళ్లు.... ♦ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపనుంది. ♦ సికింద్రాబాద్-వరంగల్ (07007/07008) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. ♦ తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.45 కు వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 9. 30కు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్-మేడారం బస్సు చార్జీల వివరాలు... బస్సు పెద్దలకు పిల్లలకు ఏసీ 552 432 సూపర్ లగ్జరీ 447 247 ఎక్స్‌ప్రెస్ 337 187 -
కర్నూలులో ఆర్టీసీకి రూ.1.58కోట్ల ఆదాయం
ఆత్మకూరు (కర్నూలు) : సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా నుంచి వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపడం వల్ల రూ. 1.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆత్మకూరులోని ఆర్టీసీ డిపో డీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా నుంచి 100 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. 44కోట్లకు నష్టాన్ని తగ్గించగలిగినట్లు చెప్పారు. 2013-14 ఇదే కాలంలో రూ. 63 కోట్ల నష్టం వచ్చిందన్నారు. అయితే సింగిల్, డబుల్ స్టాప్ సర్వీసులను నడపడం, ఇతర సమయాలలో ప్రత్యేక సర్వీసులను తిప్పుతూ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తక్కువ ఆదాయం వచ్చిన సర్వీసులను రద్దు చేసి ఎక్కువ ప్రయాణికులు వెళ్లే రూట్లలో నడుపుతున్నామని చెప్పారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, కృష్ణా పుష్కరాలలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. -
ఆర్టీసీకి పండగే
ఒంగోలు:సంక్రాంతి రద్దీ..ఆర్టీసీకి కాసులు కురిపించింది. ఊహించని విధంగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ఈ ఏడాది రానుపోను కలిపి దాదాపు 400 పైగా ప్రత్యేక సర్వీసులను నడిపింది. తద్వారా సుమారు కోటిన్నర రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. రద్దీ బాగున్నా..ఆర్టీసీలో బస్సుల కొరత కారణంగా చాలా మంది ప్రైవేటు బాట పట్టక తప్పలేదు. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై నిఘా ఉంచామని చెబుతున్నా..వాటి దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఇదీ పరిస్థితి: సంక్రాంతి పండుగకు సంబంధించి ఈనెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శనివారం సెలవు కావడంతో వారు ఈనెల 9వ తేదీనే స్వగ్రామాల బాట పడతారని భావించి జిల్లాలోని అన్ని డిపోల అధికారులను అప్రమత్తం చేశారు. స్పెషల్ సర్వీసులను ఈనెల 8వ తేదీ నుంచే నడుపుతున్నట్లు ముందస్తుగా ప్రచారం చేయడంతోపాటు దాదాపు పదిరోజుల ముందుగానే నెట్లో ప్రత్యేక సర్వీసుల జాబితా ప్రకటించారు. పెద్ద మొత్తంలో టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దాంతో 9వ తేదీ నుంచే రద్దీ ఎక్కువగా కనిపించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల నుంచి సంక్రాంతి పండుగకు ముందే దాదాపు 250 ప్రత్యేక సర్వీసులను నడిపారు. ఇక పండుగ ముగిసిన తరువాత కూడా దాదాపు మరో వంద సర్వీసులను నడిపారు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయానికే మరో 50 ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. ఇంకా ఈ రద్దీ మరో మూ డు రోజులు కొనసాగుతుందని అంచనా. కనీసంగా మరో పాతిక సర్వీసులు నడిపే అవకాశం ఉంది. అదనపు ఆదాయం రూ.1.50 కోట్ల పైమాటే: ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ ఇలా అన్ని ప్రత్యేక బస్సులకు సరాసరిన 50 శాతం అదనపు చార్జీ తప్పనిసరి. దీంతో సరాసరిన టికెట్ ధర రూ.700 ఉంది. సంక్రాంతికి ముందు, తరువాత రెండు మార్గాల్లోను కలిపి దాదాపు 400 సర్వీసులు నడిపింది. ఒక్కో సర్వీసుకు సరాసరిన 30 టికెట్లు పరిగణనలోనికి తీసుకున్నా మొత్తం ప్రయాణికుల సంఖ్య 14,400 మంది అవుతారు. ఈ లెక్కన ఆర్టీసీకి వచ్చే ఆదాయం రూ.1 కోటి 80 వేలు. ఇది కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారా మాత్రమే. ప్రతిసారీ ప్రత్యేక సర్వీసులు తిరుగు ప్రయాణంలో చాలావరకు ఖాళీగా ఉండేవి. అయితే ఈ సారి తిరుగు ప్రయాణంలో కూడా దాదాపు 50 శాతం ఓఆర్ కనిపించింది. ఎక్కువగా ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ప్రయాణీకులలో కనిపించడమే కారణం. దానికితోడు రైళ్లల్లో కనీసం నుంచొని వెళ్లే అవకాశం లేకపోవడంతో చాలామంది ఆర్టీసీ బాటే పట్టారు. దీంతో తిరుగు ప్రయాణంలోను కనీసంగా అరకోటి వరకు ఆదాయం వచ్చి ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఏతావాతా కలిపి కనీసంగా రూ.1.50 కోట్ల పైగా ఆదాయం ఆర్టీసీ ఆర్జించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రద్దీ ఇలా: రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నుంచి కూడా ప్రయాణికుల జోరు ఆర్టీసీకి కలిసివచ్చింది. రోజుకు కనీసం 8 ప్రత్యేక సర్వీసులను రెండు దఫాలుగా నడిపారు. ఇది కాకుండా గుంటూరుకు కూడా ప్రత్యేక సర్వీసులను నడిపారు. పల్లె మార్గాల్లోని పల్లె వెలుగులు సైతం కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మరో పాతిక లక్షల ఆదాయం లభించి ఉంటుందని అధికారుల అంచనా. -
పౌర్ణమి రోజున...సాగర తీరాన..
మాఘ పౌర్ణమి జాతర నేడు.. విసృ్తత ఏర్పాట్లు.. సాగర తీరానికి శోభ అచ్యుతాపురం,న్యూస్‌లైన్ : పూడిమడక తీరంలో గురువారం రాత్రి జాతర, శుక్రవారం ఉదయాన్నే మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకు గ్రామకమిటీ ఏర్పాట్లు చేస్తోం ది. వేలల్లో వచ్చే భక్తుల కోసం తీరాన్ని ఖాళీచేశారు. పడవల్ని సముద్రంలో లంగరువేసారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు తీరం వద్ద మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తెరచాపలతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం మహిళా పోలీసులను నియమిం చారు. దీంతోబాటు వైద్య సేవలూ అందుబాటులో ఉంచారు. పంచాయతీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. గజ ఈతగాళ్లు సిద్ధం... గ్రామనాయకుడు మేరుగు బాపునాయుడు 30 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. వీరు స్నానాలు జరుగుతున్నంతసేపు ప్రత్యేక బ్యాడ్జిలను ధరించి పరిస్థితిని గమనిస్తారు. అత్యవసర సమయంలో సేవలందిస్తారు. ప్రయాణంలో సూచనలు... దూరప్రాంతాల నుంచి వచ్చేవారు స్వంత వాహనాల్లోగానీ, ఆర్టీసీ బస్సుల్లోగానీ రావాలి. ఆటోలను ప్రైవేటు వాహనాలను అచ్యుతాపురం వద్ద నిలిపివేస్తారు. పూడిమడక హైస్కూల్ వద్ద వాహనాలను పార్కింగ్‌చేసి తీరానికి నడిచి చేరుకోవాలి. స్నానానంతరం జగన్నాథస్వామి ఆలయంలో పూజలు చేయించుకోవచ్చు. లైట్‌హౌస్ ఎక్కి సముద్రాన్ని చూడడం ఎప్పటికీ మచ్చిపోలే నిది. ఆలస్యం ఎందుకు పూడిమడక పుణ్యస్నానాలకి పోదాం పదండి. వాడపాలెంలో... రాంబిల్లి : మాఘ పౌర్ణమి జాతరకు రాంబిల్లి శివారు వాడపాలెం సముద్ర తీరం ముస్తాబైంది. గురువారం రాత్రి నుంచి ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. తీరంలో పుణ్య స్నానాలు అనంతరం గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఏట ఇక్కడ జరిగే మాఘ పౌర్ణమి జాతరకు వేలాది మంది ప్రజలు తరలివస్తారు. తీరానికి వెళ్లే రోడ్డు ఇరువైపులా పెరిగిన తుప్పలను మదర్ థెరిసా సేవా సంఘం సభ్యులు శ్రమదానంతో తొలగించారు. చెత్త చెదారాన్ని తీసేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఎస్ఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. రేవుపోలవరంలో ఏర్పాట్లు పరిశీలన ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో మాఘపౌర్ణమి జాతర ఏర్పాట్లను ఈవోపీఆర్డీ కె.చంద్రశేఖరరావు బుధవారం పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చోడిపిల్లి బంగారి, పంచాయతీ కార్యదర్శి బీఏబీఎల్ మూర్తితో చర్చించారు. మహిళల స్నానాలకు ప్రత్యేకంగా గదులు, తాత్కాలిక మరుగు దొడ్లు నిర్మించాలని సూచించారు. చక్రతీర్థం ప్రాగంణం పరిసరాలు పరిశుభ్ర చేయించాలన్నారు. స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చిన సాయి భక్తులకు సహకారం అందించి జాతర విజయవంతం చేయాలన్నారు. తీరంలోని ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ జి. బాలకృష్ట తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో బ్రహ్మ,సుబ్బారావు,ఆర్డబ్ల్యూ ఎస్ జేఈ రాజు,మండల ఇంజినీరు సుధాకర్ పాల్గొన్నారు. ముస్తాబవుతున్న ముత్యాలమ్మపాలెం ముత్యాలమ్మపాలెం(పరవాడ) : మాఘ పౌర్ణమి సందర్భంగా ముత్యాలమ్మపాలెం తీరంశోభాయమానంగా తయారైంది. గురువారం సాయంత్రం నుంచే భక్తులు సముద్ర తీరానికి చేరుకొని రాత్రంతా జాగరణ చేస్తారు. శుక్రవారం సూర్యోదయాన సముద్ర స్నానం చేసి మాధవ స్వామిని దర్శించుకుంటారు. జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు వాసుపల్లి సోమశేఖర్ తెలిపారు. తీరంలో పుణ్య స్నానాలు ఆచరించే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ గస్తీ... జాతరను పురస్కరించుకొని సముద్ర తీరంలో ప్రత్యేక పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నామని పరవాడ సీఐ పి.రమణ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. తీరంలో ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రదేశాల్లో స్నానాలకు దిగవద్దని హెచ్చరించారు. భారీ వాహనాలను ముత్యాలమ్మపాలెం కూడలిలో నిలిపివేస్తున్నట్టు చెప్పారు. మాఘపూర్ణిమకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు విశాఖపట్నం : మాఘపూర్ణిమ సందర్భంగా ఈనెల 14న జిల్లాలోని తీర ప్రాంతాల్లో క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ వై. జగదీష్‌బాబు తెలిపారు. పూడిమడక, రేవుపోలవరం తీరాల్లో సముద్రతీర స్నానాలను ఆచరించడానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 13 అర్థరాత్రి నుంచి 14 సాయంత్రం వరకు స్పెషల్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. పూడిమడక జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అనకాపల్లి, కొండకర్ల, అచ్చుతాపురం నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రేవు పోలవరం జాతరకు వెళ్లే వారికి నర్సీపట్నం, అడ్డురోడ్, యలమంచిలి నుండి 60 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.