ఆర్టీసీకి పండగే | Private robbery RTC special buses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి పండగే

Published Mon, Jan 19 2015 4:22 AM | Last Updated on Mon, Oct 22 2018 8:06 PM

Private robbery RTC special buses

 ఒంగోలు:సంక్రాంతి రద్దీ..ఆర్టీసీకి కాసులు కురిపించింది. ఊహించని విధంగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ఈ ఏడాది రానుపోను కలిపి దాదాపు 400 పైగా ప్రత్యేక సర్వీసులను నడిపింది. తద్వారా సుమారు కోటిన్నర రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. రద్దీ బాగున్నా..ఆర్టీసీలో బస్సుల కొరత కారణంగా చాలా మంది ప్రైవేటు బాట పట్టక తప్పలేదు. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై నిఘా ఉంచామని చెబుతున్నా..వాటి దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది.  
 
 ఇదీ పరిస్థితి:
 సంక్రాంతి పండుగకు సంబంధించి ఈనెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.  సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శనివారం సెలవు కావడంతో వారు ఈనెల 9వ తేదీనే స్వగ్రామాల బాట పడతారని భావించి జిల్లాలోని అన్ని డిపోల అధికారులను అప్రమత్తం చేశారు. స్పెషల్ సర్వీసులను ఈనెల 8వ తేదీ నుంచే నడుపుతున్నట్లు ముందస్తుగా ప్రచారం చేయడంతోపాటు దాదాపు పదిరోజుల ముందుగానే నెట్‌లో ప్రత్యేక సర్వీసుల జాబితా ప్రకటించారు. పెద్ద మొత్తంలో టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దాంతో  9వ తేదీ నుంచే రద్దీ ఎక్కువగా కనిపించింది.  చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల నుంచి సంక్రాంతి పండుగకు ముందే దాదాపు 250 ప్రత్యేక సర్వీసులను నడిపారు. ఇక పండుగ ముగిసిన తరువాత కూడా దాదాపు మరో వంద సర్వీసులను నడిపారు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయానికే మరో 50 ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. ఇంకా ఈ రద్దీ మరో మూ డు రోజులు కొనసాగుతుందని అంచనా. కనీసంగా మరో పాతిక సర్వీసులు నడిపే అవకాశం ఉంది.  
 
 అదనపు ఆదాయం రూ.1.50 కోట్ల పైమాటే:
 ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ ఇలా అన్ని ప్రత్యేక బస్సులకు సరాసరిన 50 శాతం అదనపు చార్జీ తప్పనిసరి. దీంతో సరాసరిన టికెట్ ధర రూ.700 ఉంది. సంక్రాంతికి ముందు, తరువాత రెండు మార్గాల్లోను కలిపి దాదాపు 400 సర్వీసులు నడిపింది. ఒక్కో సర్వీసుకు సరాసరిన 30 టికెట్లు పరిగణనలోనికి తీసుకున్నా మొత్తం ప్రయాణికుల సంఖ్య 14,400 మంది అవుతారు. ఈ లెక్కన ఆర్టీసీకి వచ్చే ఆదాయం రూ.1 కోటి 80 వేలు. ఇది కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారా మాత్రమే. ప్రతిసారీ ప్రత్యేక సర్వీసులు తిరుగు ప్రయాణంలో చాలావరకు ఖాళీగా ఉండేవి. అయితే ఈ సారి తిరుగు ప్రయాణంలో కూడా దాదాపు 50 శాతం ఓఆర్ కనిపించింది. ఎక్కువగా ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ప్రయాణీకులలో కనిపించడమే కారణం. దానికితోడు రైళ్లల్లో కనీసం నుంచొని వెళ్లే అవకాశం లేకపోవడంతో చాలామంది ఆర్టీసీ బాటే పట్టారు. దీంతో తిరుగు ప్రయాణంలోను కనీసంగా అరకోటి వరకు ఆదాయం వచ్చి ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఏతావాతా కలిపి కనీసంగా రూ.1.50 కోట్ల పైగా ఆదాయం ఆర్టీసీ ఆర్జించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
 
 రద్దీ ఇలా:
 రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నుంచి కూడా ప్రయాణికుల జోరు ఆర్టీసీకి కలిసివచ్చింది. రోజుకు కనీసం 8 ప్రత్యేక సర్వీసులను రెండు దఫాలుగా నడిపారు.  ఇది కాకుండా గుంటూరుకు కూడా ప్రత్యేక సర్వీసులను నడిపారు.  పల్లె మార్గాల్లోని పల్లె వెలుగులు సైతం కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మరో పాతిక లక్షల ఆదాయం లభించి ఉంటుందని అధికారుల అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement