సాక్షి, అమరావతిబ్యూరో: సంక్రాంతి పండక్కి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకూ కృష్ణా రీజియన్ పరిధిలోని విజయవాడ నుంచి అన్ని సెక్టార్లకు 829 అదనపు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రద్దీగా ఉన్న ప్రాంతాలకు అవసరాన్ని బట్టీ సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఆయా సర్వీసులు నడుస్తాయి.
డిమాండ్ బారెడు
ఈనెల 12వ తేదీ నుంచి విద్యాసంస్థలకు సెలవులు. జన్మభూమి ఈనెల 11వ తేదీతో ముగుస్తుండటంతో 12 నుంచి సెలవులు ప్రకటించారు. రాజధానిలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అధికారులు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్తారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఎనిమిది రోజుల పాటు ప్రధాన రూట్లలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.
8 రోజులు : 829 ప్రత్యేక బస్సులు
పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు బుధవారం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎనిమిది రోజుల పాటు 829 బస్సులు ప్రత్యేకంగా> నడుపుతారు. బుధవారం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో 106 బస్సులు, 11న 111 బస్సులు, 12న 112 బస్సులు, 14న 125 బస్సులు, 15న 125 బస్సులు, 16న 125 బస్సులు, 17న 125 బస్సులు తిప్పనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇలా దోచేస్తున్నారు..
పండగ సమయాల్లో తిప్పే ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ బస్సుల్లో విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.1,000 టికెట్ ఉంటే, ప్రత్యేక బస్సులో మాత్రం రూ.1,500 వసూలు చేస్తున్నారు. దీనివల్ల పండగ సమయాల్లో ఆర్టీసీకి కాసులు పంట పండుతోంది. ప్రత్యేక సర్వీసుల్లో ఎక్కువ భాగం నాన్ ఏసీ బస్సులే నడుపుతారు. ఏసీ బస్సుల కొరత ఉండడంతో పది బస్సులు మాత్రమే తిప్పనున్నారు. అటు ప్రైవేట్ బస్సుల్లో సా«ధారణ రోజుల టికెట్ కంటే నాలుగు రెట్లు అదనంగా చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు.
డొక్కు బస్సులతో అవస్థలు
పండుగ సందర్భాల్లో ఆర్టీసీ తిప్పే వాటిలో ఎక్కువగా డొక్కు బస్సులే ఉంటున్నాయి. కృష్ణా రీజియన్ పరిధిలోని బస్సుల సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో సరైన సౌకర్యాలు లేని బస్సులనే తిప్పుతున్నారు. వీటివల్ల రాత్రివేళ ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో చలిగాలుల తీవ్రతకు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment