పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
♦ ఆగస్టు 12వ తేదీ నుంచి 23 వరకు
♦ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్
♦ హైదరాబాద్ జోన్ ఆర్టీసి ఈడీ వేణు
తాండూరు: కృష్ణ పుష్కరాల కోసం 1,100 ప్రత్యేక బస్సులు నడపునున్నట్టు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డి.వేణు వెల్లడించారు. తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాలనుంచి 200, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి 900 బస్సులను పుష్కరాలకు నడపనున్నట్టు వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిని బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అయితే పుష్కర ఘాట్‌ల వరకు చేరుస్తాయని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బీచ్‌పల్లి, రంగాపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లి, సోమశిలలోని పుష్కర ఘాట్‌లకు బస్సులు తీసుకెళ్తాయి. విజయవాడ వరకు 50 బస్సులు వేశారు. ఏసీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ తదితర బస్సుల్లో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. 50మంది ప్రయాణికులు కలిసి వస్తే వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు అదనపు చార్జీలు ఉంటాయని, ఎంత అనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.