KRISHNA PUSHKAR
-
దేవాలయం.. దివాలా తీసింది..!
► ఆర్థిక ఇబ్బందులతో ఆలయాలు.. ఉన్న నిధులు పుష్కరాలకు ఊడ్చిపెట్టిన ఫలితం ► ఆదాయం సరిపోక నామమాత్రంగా ఉత్సవాలు... సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా పుష్కరాలు దేవాలయాలను ఆర్థికంగా దివాలాతీశాయి. పుష్కరాల కోసం జరిపిన అభివృద్ధి పనులకు దేవాలయ నిధులు హరించుకుపోయాయి. బ్యాంకు డిపాజిట్లు కూడా వినియోగించటంతో ఇప్పుడు ఆలయాల వద్ద నగదు నిల్వలు లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు లేక వేడుకలు కూడా నామమాత్రంగా నిర్వహించాల్సి వస్తోంది. వరసగా రెండేళ్లలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలు గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనగా.. ప్రభుత్వానికి కనీవినీ ఎరుగని రీతిలో కీర్తి దక్కింది. కానీ దేవాలయాల పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా మారింది. పండగలు, ప్రత్యేక వేడుకల సమయాల్లో తప్ప ఆలయాలకు ఆదాయం లభించడం లేదు. ఇలాంటి సమయాల్లో బ్యాంకుల్లోని డిపాజిట్ల పై వచ్చే వడ్డీ డబ్బులు వాడుకోవటం సహజం. కానీ ఇప్పుడు ఆ డిపాజిట్లు హరించుకుపోవటంతో వడ్డీ డబ్బులు కూడా లేక దేవాలయాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్లు గడిచినా అందని నిధులు.. గోదావరి, కృష్ణా పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వేడుకలకు దాదాపు రూ.800 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆయా సందర్భాల్లో ప్రకటించింది. కానీ కొన్ని నిధులు మాత్రమే కేటాయించి, ఆలయాల నిధులతో పనులు జరిపించింది. ఉన్నతాధికారులు చెప్పిన మాటలతో బ్యాంకుల్లో ఆలయ కమిటీలు బ్యాంకు డిపాజిట్లు కూడా వాడేశాయి. ఈ నిధులతో రోడ్లు, స్నానఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి... ఇలాంటి పనులు చకచకా జరిగాయి. కానీ.. ఆలయాల వద్ద అవసరమైన అభివృద్ధి పనులకు మాత్రం నిధులు విడుదల కాలేదు. గోదావరి పుష్కరాలు ముగిసి రెండేళ్లు, కృష్ణా పుష్కరాలు పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందలేదు. దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధి కూడా బోసిపోయి ఉండటంతో అక్కడి నుంచీ నిధులు విడుదల కాలేదు. రోజువారీ ఆదాయంతో నిర్వహణ.. ఇప్పుడు ఆలయాల బ్యాంకు ఖాతాలు నిండుకుని కష్టాలు మొదలయ్యాయి. వేడుకలప్పుడు రంగులు వేయటం కూడా కష్టంగా మారింది. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ప్రధాన శైవదేవాలయానికి ఉన్న రూ.కోటి బ్యాంకు డిపాజిట్లను గోదావరి పుష్కరాల సమయంలో వాడేశారు. బ్యాంకు వడ్డీ రూపంలో వచ్చే రూ.70వేల ఆదాయం ఇప్పు డు కరువైంది. ఉత్సవాలను మమా అనిపించి చేతులు దులుపుకొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మరో ప్రధాన ఆలయంలో భక్తుల వసతి గృహాల నిర్వహణ స్తంభించి సమస్యలు ఏర్పడ్డాయి. ఇదే జిల్లాకు చెందిన మరో దేవాలయానికి వచ్చే దీక్షా భక్తులకు గతంలో తరహా వసతులు ఇప్పుడు లేవు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడలాంటి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇవి మినహా మిగతా ఆలయాలకు ప్రభుత్వం నుంచి సాయం అందక వాటి నిర్వహణ రోజువారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. -
పుష్కరాలకు కార్పొరేషన్ ఉద్యోగులు
నెల్లూరు, సిటీ: విజయవాడ పుష్కరాలకు నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి 37 మంది ఉద్యోగులు వెళ్లనున్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా ఈ విధుల్లో పాల్గొననున్నారు. కార్పొరేషన్ మేనేజర్ రాజేంద్ర, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సూపరింటెండెంట్ బాలకృష్ణ, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చిన్నబాబు, కృపాకర్, శేఖర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్లు ఇనాయతుల్లా, వై చెంచయ్య, విశ్వరత్నం, నారాయణరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శివకుమార్, రవికుమార్, సునీల్‌కుమార్, ఎఫ్1 ముణిరత్నంలు ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఐదు మందిని కేటాయించారు. వీరందరూ ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పుష్కర విధుల్లో ఉంటారు. ఈ క్రమంలో గురువారం (నేడు) ట్రైనింగ్‌లో భాగంగా విజయవాడకు వెళ్లనున్నారు. -
పుష్కరాల సంచిక విడుదల
ఝరాసంగం రూరల్: రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ చేతులమీదుగా కృష్ణా పుష్కరాల సంచికను విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కేవీ రమణాచారి చాంబర్లో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యత, పుష్కరాల సమయాలు, ఘట్టాలు, ఆశ్రమం తరఫున భక్తులకు అందించే సేవలకు సంబంధించిన సంచికను విడుదల చేశారు. పూర్వం నుంచి వేద పండితులు పుష్కరాల ప్రాముఖ్యతను తెలుపుతున్నట్లు అనేక గ్రంథాల్లో ఉన్నదని రమణచారి, పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ తెలిపారు. పుష్కరాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరు పూనీతులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
♦ ఆగస్టు 12వ తేదీ నుంచి 23 వరకు ♦ ఆన్లైన్లో టిక్కెట్ల బుకింగ్ ♦ హైదరాబాద్ జోన్ ఆర్టీసి ఈడీ వేణు తాండూరు: కృష్ణ పుష్కరాల కోసం 1,100 ప్రత్యేక బస్సులు నడపునున్నట్టు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డి.వేణు వెల్లడించారు. తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాలనుంచి 200, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి 900 బస్సులను పుష్కరాలకు నడపనున్నట్టు వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిని బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అయితే పుష్కర ఘాట్ల వరకు చేరుస్తాయని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బీచ్పల్లి, రంగాపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లి, సోమశిలలోని పుష్కర ఘాట్లకు బస్సులు తీసుకెళ్తాయి. విజయవాడ వరకు 50 బస్సులు వేశారు. ఏసీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ తదితర బస్సుల్లో ప్రయాణించేందుకు ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. 50మంది ప్రయాణికులు కలిసి వస్తే వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు అదనపు చార్జీలు ఉంటాయని, ఎంత అనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. -
పుష్కరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాల్లో యాత్రికుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.రాంకిషన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ముఖ్యమైన 10 పుష్కర ఘాట్ల లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహించారు. 20 మంది టెండర్లు దాఖలుచేయగా 15 తిరస్కరణకు గురయ్యాయి. ఐదు దరఖాస్తులు టెండర్లకు అర్హత సాధించాయి. అందులో తక్కువ ధరలకు సమ్మతించిన సంస్థలకు టెండర్లు ఖరారుచేశారు. టెండర్‌దారులు ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏజేసీ రంజిత్‌ప్రసాద్, అడిషనల్ ఎస్పీ కల్మేశ్వర్ షింగేనవర్, డీఆర్వో భాస్కర్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ రాములు, మల్లేశం పాల్గొన్నారు. -
పుష్కర యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
కర్నూల్ జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ ఆర్డీఓతో కలిసి వాహనాల పార్కింగ్ ప్రాంతాల పరిశీలన పెద్దదోర్నాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టవల్సిన చర్యలపై గురువారం మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావుతో కలిసి మండల కేంద్రంలోని పలు ప్రాంతాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 12 నుంచి 12 రోజుల పాటు జరిగే కృష్ణా పుష్కరాలకు దేశంలోనే ప్రసిద్ధ ౖశైవ క్షేత్రం శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాత్రికులు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామన్నారు. మండల కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కర్నూల్ జిల్లాకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించామన్నారు. మార్కాపురం ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తారన్నారు. వాహనా లు నిలిపే ప్రాంతాల్లో ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తారన్నారు. వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారి శుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, టీడీపీ మండల కన్వీనర్ కె.రఘనాథరెడ్డి పాల్గొన్నారు.