దేవాలయం.. దివాలా తీసింది..!
► ఆర్థిక ఇబ్బందులతో ఆలయాలు.. ఉన్న నిధులు పుష్కరాలకు ఊడ్చిపెట్టిన ఫలితం
► ఆదాయం సరిపోక నామమాత్రంగా ఉత్సవాలు...
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా పుష్కరాలు దేవాలయాలను ఆర్థికంగా దివాలాతీశాయి. పుష్కరాల కోసం జరిపిన అభివృద్ధి పనులకు దేవాలయ నిధులు హరించుకుపోయాయి. బ్యాంకు డిపాజిట్లు కూడా వినియోగించటంతో ఇప్పుడు ఆలయాల వద్ద నగదు నిల్వలు లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు లేక వేడుకలు కూడా నామమాత్రంగా నిర్వహించాల్సి వస్తోంది.
వరసగా రెండేళ్లలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలు గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనగా.. ప్రభుత్వానికి కనీవినీ ఎరుగని రీతిలో కీర్తి దక్కింది. కానీ దేవాలయాల పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా మారింది. పండగలు, ప్రత్యేక వేడుకల సమయాల్లో తప్ప ఆలయాలకు ఆదాయం లభించడం లేదు. ఇలాంటి సమయాల్లో బ్యాంకుల్లోని డిపాజిట్ల పై వచ్చే వడ్డీ డబ్బులు వాడుకోవటం సహజం. కానీ ఇప్పుడు ఆ డిపాజిట్లు హరించుకుపోవటంతో వడ్డీ డబ్బులు కూడా లేక దేవాలయాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
రెండేళ్లు గడిచినా అందని నిధులు..
గోదావరి, కృష్ణా పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వేడుకలకు దాదాపు రూ.800 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆయా సందర్భాల్లో ప్రకటించింది. కానీ కొన్ని నిధులు మాత్రమే కేటాయించి, ఆలయాల నిధులతో పనులు జరిపించింది. ఉన్నతాధికారులు చెప్పిన మాటలతో బ్యాంకుల్లో ఆలయ కమిటీలు బ్యాంకు డిపాజిట్లు కూడా వాడేశాయి.
ఈ నిధులతో రోడ్లు, స్నానఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి... ఇలాంటి పనులు చకచకా జరిగాయి. కానీ.. ఆలయాల వద్ద అవసరమైన అభివృద్ధి పనులకు మాత్రం నిధులు విడుదల కాలేదు. గోదావరి పుష్కరాలు ముగిసి రెండేళ్లు, కృష్ణా పుష్కరాలు పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందలేదు. దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధి కూడా బోసిపోయి ఉండటంతో అక్కడి నుంచీ నిధులు విడుదల కాలేదు.
రోజువారీ ఆదాయంతో నిర్వహణ..
ఇప్పుడు ఆలయాల బ్యాంకు ఖాతాలు నిండుకుని కష్టాలు మొదలయ్యాయి. వేడుకలప్పుడు రంగులు వేయటం కూడా కష్టంగా మారింది. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ప్రధాన శైవదేవాలయానికి ఉన్న రూ.కోటి బ్యాంకు డిపాజిట్లను గోదావరి పుష్కరాల సమయంలో వాడేశారు. బ్యాంకు వడ్డీ రూపంలో వచ్చే రూ.70వేల ఆదాయం ఇప్పు డు కరువైంది. ఉత్సవాలను మమా అనిపించి చేతులు దులుపుకొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మరో ప్రధాన ఆలయంలో భక్తుల వసతి గృహాల నిర్వహణ స్తంభించి సమస్యలు ఏర్పడ్డాయి. ఇదే జిల్లాకు చెందిన మరో దేవాలయానికి వచ్చే దీక్షా భక్తులకు గతంలో తరహా వసతులు ఇప్పుడు లేవు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడలాంటి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇవి మినహా మిగతా ఆలయాలకు ప్రభుత్వం నుంచి సాయం అందక వాటి నిర్వహణ రోజువారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సి వస్తోంది.