పుష్కర యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
-
కర్నూల్ జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్
-
ఆర్డీఓతో కలిసి వాహనాల పార్కింగ్ ప్రాంతాల పరిశీలన
పెద్దదోర్నాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టవల్సిన చర్యలపై గురువారం మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావుతో కలిసి మండల కేంద్రంలోని పలు ప్రాంతాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 12 నుంచి 12 రోజుల పాటు జరిగే కృష్ణా పుష్కరాలకు దేశంలోనే ప్రసిద్ధ ౖశైవ క్షేత్రం శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాత్రికులు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామన్నారు. మండల కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కర్నూల్ జిల్లాకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించామన్నారు. మార్కాపురం ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తారన్నారు. వాహనా లు నిలిపే ప్రాంతాల్లో ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తారన్నారు. వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారి శుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, టీడీపీ మండల కన్వీనర్ కె.రఘనాథరెడ్డి పాల్గొన్నారు.