సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్ ద్వారా సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటు లోకి తెచ్చింది. సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అన్ని రైళ్లలోని అన్‌రిజర్వ్‌డ్ బోగీలకూ విస్తరించారు. ఇందుకోసం అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి మూడు గంటల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 554 రైల్వేస్టేషన్లలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు జనరల్ క్లాస్ టికెట్‌లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
దశలవారీగా సమీప రైల్వేజోన్లకు.. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎంజీ శేఖరం, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన యూటీఎస్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి బయలుదేరే రైళ్లలో యూటీఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే సేవల డిజిటైజేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే మొదటి నుంచి ముందు వరుసలో ఉందని, 80 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం ఏర్పాటు చేశామని, త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని జీఎం చెప్పారు.
యూటీఎస్ సేవలు ఇలా..
పండుగలు, వరుస సెలవుల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సాధారణ తరగతి టికెట్ల కోసం ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లే వరకూ టికెట్ లభించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో యూటీఎస్ యాప్ ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని రైలు ఎక్కొచ్చు. యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు బయలుదేరే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉండాలి. ఆ రోజు బయలుదేరే రైళ్ల(కరెంట్ బుకింగ్)లో మాత్రమే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
3 గంటల పాటు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఆ వ్యవధిలో బయలుదేరకుండా ఉంటే టికెట్ డబ్బులు నష్టపోవాలి. సాధారణ రైళ్లతో పాటు సబర్బన్ రైళ్లలో టికెట్లూ బుక్ చేసుకోవచ్చు. సీజనల్ టికెట్లు(నెలవారీ/3 నెలల పాస్‌లు) పొందవచ్చు. రెన్యువల్ చేసుకొవచ్చు. రైల్వే స్టేషన్లలోకి రెండు గంటల పాటు అనుమతించే ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా ఈ యాప్ ద్వారా లభిస్తాయి. యూటీఎస్ యాప్ ద్వారా ఒకేసారి నలుగురికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
రెండు రకాల టికెట్లు..
యూటీఎస్ యాప్ బుకింగ్స్‌లో రెండు రకాల టికెట్ ఆప్షన్లు ఉన్నాయి. పేపర్‌లెస్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్ టికెట్ కావాలనుకుంటే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బుకింగ్ కౌంటర్లలో తమ మొబైల్ నంబర్, టికెట్ బుకింగ్ కోడ్ చెబితే ప్రింటెడ్ టికెట్ ఇస్తారు. స్టేషన్లలోని ఏటీవీఎంల నుంచీ పేపర్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్‌లెస్ టికెట్లను మొబైల్‌లో భద్రపరుచుకుని టికెట్ ఎగ్జామినర్లకు చూపిస్తే సరిపోతుంది. పేపర్‌లెస్ టికెట్లకు ఏ రోజుకు ఆ రోజు రంగు మారిపోతుంది. టిక్కెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
ఆర్–వాలెట్‌పై 5 శాతం రాయితీ..
ప్రయాణికులు ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ స్మార్ట్‌ఫోన్లలోని ప్లేస్టోర్ల నుంచి ‘యూటీఎస్’యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పేరు, మొబైల్ నంబర్, ఆధార్ తదితర వివరాలు నమోదు చేయాలి. దాంతో యూటీఎస్ యాప్ నుంచి టికెట్ బుకింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ యాప్‌లో రైల్వే వాలెట్ (ఆర్–వాలెట్) కూడా ఉంటుంది. ఆర్–వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేస్తే 5 శాతం రాయితీ లభిస్తుంది. పేటీఎం, పేమెంట్ గేట్‌వే, నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లోనూ టికెట్ల డబ్బులు చెల్లించవచ్చు.
యాప్‌ను ఆవిష్కరిస్తున్న జీఎం వినోద్
Comments
Please login to add a commentAdd a comment