GM Vinodkumar
-
సామాన్యుడికి చేరువ కావాలి అదే మా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. సామాన్యుడికి రైల్వే సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, దక్షిణమధ్య రైల్వే పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రత, కొత్తలైన్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలివీ... సాక్షి: దక్షిణ మధ్య రైల్వే పురోగతి ఎలా ఉంది? జీఎం: బావుంది. ఆదాయ పెరుగుదలతో దక్షిణమధ్య రైల్వే ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.7,017 కోట్లు ఆర్జించింది. 2016లో ఇది రూ.6,171గా ఉంది. అంటే 13.71 శాతం పెరుగుదల నమోదైంది. ఆదాయాభివృద్ధి పెరుగుదలలో దేశంలోనే మొదటిస్థానం సాధించాం. ఇక సరుకు రవాణా ఆదాయంలో దేశంలో 5వ స్థానంలో నిలిచాం. భారతీయ రైల్వే చేపట్టిన అంబ్రెల్లా ప్రాజెక్టుల గురించి వివరిస్తారా? దీని కింద ప్రతీ జోన్లో ఉన్న జీఎంకు రూ.100 కోట్ల నిధులొస్తాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్యం మేరకు స్టేషన్లలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వెచ్చించవచ్చు. ముఖ్యంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, హైలెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పా టు చేస్తున్నాం. రాబోయే రెండు మూడేళ్లలో జోన్ పరిధిలో ఉన్న 742 స్టేషన్లలో ఈ పనులు పూర్తవుతాయి. మాసాయిపేట దుర్ఘటన తరువాత కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగుల నిర్మూలిస్తామన్నారు కదా! ఆ పనులు పూర్తయ్యాయా? కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు అక్టోబర్ 31 గడువుగా పెట్టుకుని పూర్తిచేశాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగులు లేవు. 2018 చివరి నాటికి దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల నిర్మూలన దిశగా భారతీయ రైల్వే కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆర్వోబీ/ఆర్యూబీల పనుల పురోగతి? గత నాలుగేళ్లలో 379 ఆర్వోబీ/ఆర్‌యూబీలను పూర్తి చేశాం. మిగిలిన 264 ఆర్వోబీ/ఆర్యూబీ ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనులు ఎంతవరకు వచ్చాయి? ఎంఎంటీఎస్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేక్స్(నాలుగు బోగీలు కలిగిన రైళ్లు) కొనుగోలు మాత్రమే మిగిలింది. అవి రాగానే సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2ని యాదాద్రి వరకు పొడిగిస్తారా? ఈ ప్రాజెక్టు చేపట్టడానికి మేం సుముఖమే. సర్వే కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరీంనగర్–హసన్‌పర్తి కొత్త లైన్ సర్వే పనులు ఎలా ఉన్నాయి? ఉత్తర తెలంగాణను ఉత్తర భారతంతో కలిపే ప్రాజెక్టు ఇది. దీని సర్వే పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి సర్వే పూర్తవుతుంది. శివారు స్టేషన్ల అభివృద్ధి, టెర్మినళ్ల నిర్మాణానికి ఏం చర్యలు తీసుకున్నారు? సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై రద్దీ పెరిగిన నేపథ్యంలో లింగంపల్లి స్టేషన్‌ని నాలుగో టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం 5 రైళ్లను అక్కడ నుంచి నడుపుతున్నాం. త్వరలోనే మరిన్ని నడుపుతాం. చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలుపెట్టాం. అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నాం. మొత్తం రూ.224 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రైల్వే పనుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొత్త రైల్వే పనుల కోసం భారతీయ రైల్వే ఎప్పుడూ ముందుంటుంది. ఇందుకోసం జాయింట్ వెంచర్ విధానంలో ముందుకెళుతున్నాం. రాష్ట్రాలు 51 శాతం, కేంద్రం 49 శాతం నిధులతో ప్రాజెక్టులు చేపడతాం. ఈ విధానాన్ని వినియోగించుకోవడంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. దీనిపై ఏపీ సంతకం చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. తెలంగాణతో ఇంకా సంప్రదింపులు నడుస్తున్నాయి. స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతీ స్టేషన్‌కు రూ.30 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. స్టేషన్ల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ఆయా స్టేషన్ల ముఖద్వారాల్లో స్థానిక పట్టణ విశిష్టతను తెలిపేలా చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక రూ.400 కోట్ల నిధులతో తిరుపతి స్టేషన్‌కు అభివృద్ధి పనులు చేపట్టాం -
మొబైల్ నుంచీ జనరల్ టికెట్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్ ద్వారా సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటు లోకి తెచ్చింది. సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకూ విస్తరించారు. ఇందుకోసం అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి మూడు గంటల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 554 రైల్వేస్టేషన్లలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు జనరల్ క్లాస్ టికెట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. దశలవారీగా సమీప రైల్వేజోన్లకు.. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎంజీ శేఖరం, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన యూటీఎస్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి బయలుదేరే రైళ్లలో యూటీఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే సేవల డిజిటైజేషన్లో దక్షిణ మధ్య రైల్వే మొదటి నుంచి ముందు వరుసలో ఉందని, 80 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం ఏర్పాటు చేశామని, త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని జీఎం చెప్పారు. యూటీఎస్ సేవలు ఇలా.. పండుగలు, వరుస సెలవుల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సాధారణ తరగతి టికెట్ల కోసం ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లే వరకూ టికెట్ లభించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో యూటీఎస్ యాప్ ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని రైలు ఎక్కొచ్చు. యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు బయలుదేరే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉండాలి. ఆ రోజు బయలుదేరే రైళ్ల(కరెంట్ బుకింగ్)లో మాత్రమే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 3 గంటల పాటు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఆ వ్యవధిలో బయలుదేరకుండా ఉంటే టికెట్ డబ్బులు నష్టపోవాలి. సాధారణ రైళ్లతో పాటు సబర్బన్ రైళ్లలో టికెట్లూ బుక్ చేసుకోవచ్చు. సీజనల్ టికెట్లు(నెలవారీ/3 నెలల పాస్‌లు) పొందవచ్చు. రెన్యువల్ చేసుకొవచ్చు. రైల్వే స్టేషన్లలోకి రెండు గంటల పాటు అనుమతించే ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా ఈ యాప్ ద్వారా లభిస్తాయి. యూటీఎస్ యాప్ ద్వారా ఒకేసారి నలుగురికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు రకాల టికెట్లు.. యూటీఎస్ యాప్ బుకింగ్స్‌లో రెండు రకాల టికెట్ ఆప్షన్లు ఉన్నాయి. పేపర్‌లెస్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్ టికెట్ కావాలనుకుంటే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బుకింగ్ కౌంటర్లలో తమ మొబైల్ నంబర్, టికెట్ బుకింగ్ కోడ్ చెబితే ప్రింటెడ్ టికెట్ ఇస్తారు. స్టేషన్లలోని ఏటీవీఎంల నుంచీ పేపర్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్‌లెస్ టికెట్లను మొబైల్లో భద్రపరుచుకుని టికెట్ ఎగ్జామినర్లకు చూపిస్తే సరిపోతుంది. పేపర్‌లెస్ టికెట్లకు ఏ రోజుకు ఆ రోజు రంగు మారిపోతుంది. టిక్కెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆర్–వాలెట్‌పై 5 శాతం రాయితీ.. ప్రయాణికులు ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ స్మార్ట్ఫోన్లలోని ప్లేస్టోర్ల నుంచి ‘యూటీఎస్’యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పేరు, మొబైల్ నంబర్, ఆధార్ తదితర వివరాలు నమోదు చేయాలి. దాంతో యూటీఎస్ యాప్ నుంచి టికెట్ బుకింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ యాప్‌లో రైల్వే వాలెట్ (ఆర్–వాలెట్) కూడా ఉంటుంది. ఆర్–వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేస్తే 5 శాతం రాయితీ లభిస్తుంది. పేటీఎం, పేమెంట్ గేట్‌వే, నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లోనూ టికెట్ల డబ్బులు చెల్లించవచ్చు. యాప్‌ను ఆవిష్కరిస్తున్న జీఎం వినోద్ -
‘కాపలా లేని రైల్వే గేట్లను ఎత్తేస్తాం’
సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీలేకుండా పని చేస్తున్నామని జీఎం వినోద్‌కుమార్ అన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రయాత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియతో మాట్లాడారు. 6 నెలలుగా ప్రమాదాల నివారణకు నిర్విరామంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల సంఖ్య 116 నుంచి 73కు తగ్గిందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.. గతేడాది 200, ఈ ఏడాది 300 కిలో మీటర్లు నూతనంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా ఎక్కువ సర్వీసులను నడిపి వెయిటింగ్ లిస్టు లేకుండా చేసే దిశగా ముందడుగు వేశామన్నారు. కాపలా లేని రైల్వే గేట్లను జీరో స్థాయికి తీసుకొస్తామని అన్నారు. గతేడాది 136, ఈ ఏడాది 132 కాపలా లేని రైల్వే గేట్లు తొలగించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మన్మాడ్ జోన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ లైన్ జోన్‌గా మారుస్తామన్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయం వద్ద మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాని తెలిపారు. రైల్వేలో మౌలిక సదాపాయాల కల్పనకు నిధుల కొరత లేదన్నారు. -
దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్ల డిజిటైజేషన్
కాచిగూడలో డిజి–పే సర్వీసులను ప్రారంభించిన ద.మ. రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా దేశంలోనే వంద శాతంవస్తు, సేవలను అందజేసే మొదటి ‘డిజి–పే స్టేషన్’గా కాచిగూడ రైల్వేస్టేషన్ అవతరించింది. టికెట్ బుకింగ్‌లతో పాటు, పార్సిళ్లు, రిటైరింగ్ రూమ్స్, పార్కింగ్ తదితర రైల్వే సదుపాయాలు, స్టాళ్లలో లభించే వస్తువులను డిజిటల్ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం డిజిటల్ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలోని అన్ని రైల్వేస్టేషన్లను డిజి–పే స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మొట్టమొదట 10 ఏ క్లాస్, ఏ–1 స్టేషన్లలో రెండో దశ డిజి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. దశల వారీగా మిగతా స్టేషన్లలోనూ నగదురహిత సేవలు ప్రారంభించనున్నామన్నారు. డిజి–పే విధానం వల్ల ప్రతి వస్తువు కొనుగోలుకు బిల్లు వస్తుందని, దీంతో అక్రమాలకు పాల్పడే అవకాశమే లేదన్నారు. స్వయంగా కొనుగోలు చేసిన జీఎం జీఎం వినోద్‌కుమార్ స్వయంగా ఒక స్టాల్లో డెబిట్ కార్డు ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. డిజి–పే పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. డిజిటల్ సర్వీసులను అందిస్తున్న స్టాల్ నిర్వాహకులకు డిజి–పే జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అదనపు జనరల్మేనేజర్ ఏకే గుప్తా, హైదరాబాద్ డీఆర్ఎం అరుణాసింగ్, ఆంధ్రాబ్యాంకు సీజీఎం సత్యనారాయణ మూర్తి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.డి.క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.