సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది.
చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment