భలే Ballet
ఒంపుల వైఖరితో ఇంపు గొలిపే నృత్యం బాలే డ్యాన్స్. ఫ్రెంచ్ వాకిట్లో నృత్యరూపకంగా ఎదిగిన ఈ క్లాసికల్ డ్యాన్స్ ప్రపంచ యవనికపై ఎప్పుడో సత్తాచాటింది. అలా విదేశాల గడపలు దాటుతూ.. భాగ్యనగరికి చేరుకుంది. అడుగడుగునా అందమైన భావాన్ని వ్యక్తం చేసే బాలే డ్యాన్స్ హైదరాబాదీల మనసులు దోచుకుంటోంది. అందుకే ఈ నృత్యరీతిని ఔపోసన పట్టడానికి చిన్నారులు, యువతీయువకులు ట్రైనింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ నృత్యాన్ని నేర్పించడానికి విదేశీ ట్రైనర్లు సిటీకి వస్తున్నారు.
మునివేళ్లపై నిలబడి.. శరీరాన్ని హరివిల్లులా వంచి.. చేతులు చాస్తూ.. విస్మయం గొలిపే భంగిమలతో సాగిపోయే నృత్యం బాలే డ్యాన్స్. సిటీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ నృత్యానికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. నగరంలో బాలే నృత్యాన్ని నేర్చుకునేవారి సంఖ్య మూడునాలుగు నెలలుగా బాగా పెరిగింది. ఈ నృత్యాన్ని నేర్పే డ్యాన్స్ మాస్టర్స్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంతకాలం ఈ డ్యాన్స్ జోరందుకోలేదు. ఇప్పుడిప్పుడే విదేశాల నుంచి డ్యాన్స్ మాస్టర్స్ సిటీకి వచ్చి మరీ స్థానికంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో ఈ ఫ్రెంచ్ నృత్యానికి క్రేజ్ వస్తోంది.
హాయిగా సాగని..
లైట్ మ్యూజిక్ కు జతగా మలయమారుతంలా సాగిపోయే బాలే డ్యాన్స్.. ఫిజికల్, సైకలాజికల్ ఎక్సర్‌సైజ్‌కు బాగా ఉపయోగపడుతుంది. అందుకే బాలే డ్యాన్స్‌కు హైదరాబాద్ రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలుకుతోంది. సికింద్రాబాద్ దగ్గర్లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో ఏర్పాటు చేసిన బాలే డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు ఆదరణ విశేషంగా లభిస్తోంది. ఈ డ్యాన్స్‌లో మెళకువలు సాధించగలిగితే.. మిగతా నృత్యరీతులనూ ఈజీగా నేర్చుకోవచ్చని ట్రైనర్స్ చెబుతున్నారు. ఈ నృత్యంలో అదిరిపోయే భంగిమలే కాదు.. అదరహో అనిపించే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఇది నేర్చుకోవడం ద్వారా మానసిక ఆనందం కూడా కలుగుతుందని చెబుతున్నారు డ్యాన్సర్లు. బాలే డ్యాన్స్ ద్వారా ఒత్తిడి దూరమవుతోందని ఇటీవల ఓ స్టూడియో చేసిన సర్వేలో వెల్లడైంది కూడా. ఈ డ్యాన్స్ వల్ల కండరాలు బలంగా మారడమే కాదు.. శరీరం నాజూకుగా తయారవుతుంది.
ఇదీ చరిత్ర
బాలే డ్యాన్స్ వెనుక 500 ఏళ్ల చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో ఫ్రెంచ్ దేశంలోని దర్బారుల్లో రాజులకు ఉల్లాసాన్ని పంచడానికి పరిచారికలు బాలే డ్యాన్స్ చేసేవారు. కాలక్రమంలో ఇది ఫ్రెంచ్ ఎల్లలు దాటి ప్రపంచ ఖ్యాతి గడించింది. ఇంగ్లండ్, ఇటలీ, రష్యా దేశాల్లో కన్సర్ట్ నృత్యంగా మారి అందరి మన్ననలు పొందింది.
ఫుల్ రెస్పాన్స్..
మాది అమెరికాలోని టెక్సాస్. ఎన్నో ఏళ్లు బాలే డ్యాన్స్‌లో శిక్షణ పొందాం. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. అవర్ సేక్రెడ్ స్పేస్‌లో ఆగస్టు నుంచి బాలే శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాను. చిన్నారులు, ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ నృత్యానికి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడి వారికి అర్థమవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ వస్తుందని నమ్ముతున్నాం.
- బెటినా, అలెక్సా, బాలే ట్రైనర్స్