సుపరిపాలనకు రోడ్‌మ్యాప్‌ | cm kcr meeting with collectors over districts development | Sakshi
Sakshi News home page

సుపరిపాలనకు రోడ్‌మ్యాప్‌

Published Tue, Oct 25 2016 2:40 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

సుపరిపాలనకు రోడ్‌మ్యాప్‌ - Sakshi

సుపరిపాలనకు రోడ్‌మ్యాప్‌

రాబోయే పదేళ్లకు ప్రణాళికలు రూపొందించండి
కొత్త కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందాలి
ప్రతి జిల్లాకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి
అవినీతి అంతం కావాలి..
లంచం ఇవ్వకుంటే పనికాదన్న భావన పోవాలి..
రైతులు అడగ్గానే ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వాలి
విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని సూచన
రాబోయే పదేళ్లకు ప్రణాళికలు రూపొందించండి: కేసీఆర్‌


సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో చిన్న విభాగాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లు, ఇతర అధికారులకు పర్యవేక్షణ సులువైం దని అన్నారు. ‘నో యువర్‌ డిస్ట్రిక్ట్స్‌–ప్లాన్‌ యు వర్‌ డిస్ట్రిక్ట్‌’ (మీ జిల్లా గురించి తెలుసుకోండి.. మీ జిల్లాకు ప్రణాళిక రూపొందించండి) అన్న నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు కావాలని సూచించారు. స్థానిక వనరులు, అవసరాలను గుర్తించి ఏ జిల్లాలో ఏం చేయాలనే విషయంపై అవగాహనకు రావాలని పేర్కొన్నారు. రాబోయే 8–10 ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పట్నుంచే పని ప్రారంభించాలని ఆదేశించారు. అడ్డదిడ్డంగా కాకుం డా ఓ పద్ధతి ప్రకారం పాలన సాగేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలన్నారు. పరిపాలనా విభాగాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్‌ అధికారులు బీపీ ఆచార్య, నర్సింగ్‌రావు, శాంతికుమారి, జనార్దన్‌రెడ్డి, రాహుల్‌ బొజ్జా, కరుణ, రఘునందన్, సత్యనారాయణరెడ్డి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, భూపాలరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఆదర్శంగా ఎర్రవల్లి, నర్సన్నపేట
‘‘నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ‘అందరి కోసం అందరం’ అనే దృక్పథంతో సామూహిక వ్యవసాయం చేస్తున్నాం. ఆ గ్రామాలను తెలంగాణకు ఆదర్శంగా నిలుపుతాం. వాటి స్ఫూర్తితో మిగతా గ్రామాలు బాగుపడాలన్నది నా ఉద్దేశం’’ అని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం అమలవుతోంది. దాని లక్ష్యాలు.. ఉద్దేశాలేంటి? కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్నదేంటి? సంక్షేమ కార్యక్రమాల అమలుకు కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలేంటి? తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం’’ అని తెలిపారు.

కలెక్టర్లందరూ పద్ధతిగా పని చేయాలి
‘‘కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లిన వారంతా యువకులు. పని చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. వీరందరూ పద్ధతి ప్రకారం ఒకే స్ఫూర్తితో పని చేస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ప్రజలు మార్పును గమనిస్తారు’’ అని సీఎం అన్నారు. సీనియర్‌ అధికారులు యువతరానికి సలహాలు సూచనలు ఇవ్వాలని, మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలుగా ఉండాలన్నారు. ‘‘జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పర్యవేక్షించాలి. కొత్త పాలనా విభాగాలు రావటంతో పనిభారం తగ్గింది. ఆ మేరకు పనితీరులో ప్రభావం, సమర్థత కనిపించాలి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలి. కుటుంబం ప్రాతిపదికగా కార్యక్రమాలు అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

ప్రణాళికకు అనుగుణంగా నిధులు
‘‘ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన వనరులుంటాయి. ఒక్కో ప్రాంత ప్రజలకు ఒక్కో రకమైన అవసరాలుంటాయి. వాటికి తగినట్లు మన ప్రణాళిక ఉండాలి. అధికారులు ముందుగా జిల్లా సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అవసరాలు గుర్తించి, వనరులను ఉపయోగంలోకి తేవాలి’’ అని సీఎం సూచించారు. ప్రతీ జిల్లాకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని వివరించారు.

అవినీతిని రూపు మాపాలి
‘‘రాష్ట్రంలో అవినీతి, రుగ్మతలు పో వాలి. డబ్బులివ్వకపోతే పనికాదనే భావన పోవాలి. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరి గితే ప్రజలకు అవినీతి రహిత పాలన అం దినట్లు లెక్క’’ అని సీఎం అన్నారు. ‘‘ట్రాన్స్‌ఫార్మర్లు కోరిన వెంటనే రైతులకు చేరాలి. రెవెన్యూ కార్యాలయాల్లో మ్యుటేషన్లు, పహాణీ నకళ్లు, సర్టిఫికెట్లు సకాలం లో అందాలి. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. రైతులకు ప్రభుత్వం అం డగా నిలుస్తుంది. అధికారులు అదే స్ఫూర్తి తో సహకరించాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించే ప్లాన్‌ చేయాలి. గిట్టుబాటు ధర అందేలా చూడాలి. వ్యవసాయ శాఖ అవసరమైన సూచనలు, సలహాలు అందించాలి. ఆ శాఖలో కొత్తగా నియమితులయ్యే ఉద్యోగుల సేవలను క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగించుకోవాలి.  తప్పు ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి నివారించగలగాలి. టీఎస్‌ ఐపాస్‌ తరహాలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనే స్పష్టత ఉండాలి. విధాన రూపకల్పన ఎంత బాగున్నా.. దాన్ని అమలు చేసేందుకు సరైన దృక్పథం లేకుంటే పథకాలు సత్ఫలితాలు ఇవ్వవు. అందుకే అనుసరించే దృక్పథమే కీలకం’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement