తమిళనాడు తరహాలో బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల శాతం పెంచేందుకు శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. బీసీ కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ముస్లిం రిజర్వేషన్ పెంచే విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ‘‘తెలంగాణలో 80 శాతానికిపైగా బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. వారి జీవన పరిస్థితులు మెరుగుపడాలి. రిజర్వేషన్లు పెరగాలి. తమిళనాడులో అక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచారు. పార్లమెంటు కూడా ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్‌లో చేర్చింది. తెలంగాణ విషయంలో కూడా అదే జరగాలి. తెలంగాణలో బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు పెంచుతాం..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ విషయంలో బీసీ కమిషన్ సమాజంలోని వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు, ప్రతిపాదనలు చేయాలని సూచించారు.
బీసీ కమిషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గౌరిశంకర్, ఆంజనేయగౌడ్ పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చేయాల్సిన పనులు, బీసీ కులాల అభ్యున్నతికి తీసుకోవల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. ‘‘ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుధీర్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలి. ప్రస్తుతమున్న బీసీ కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ముస్లిం రిజర్వేషన్ పెంచే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’’ అని అన్నారు. ‘‘బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు కుల వృత్తులతో ఉపాధి పొందుతున్నాయి. మరికొన్ని కులాల విషయంలో మాత్రం దిక్కుతోచకుండా ఉంది. మారుతున్న జీవనవిధానంతో కొన్ని కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వీటన్నింటినీ బీసీ కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాలి. సదరు కుల వృత్తులను మానవాభిరుచికి తగినట్లు ఆధునీకరించడమా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి ఉపాధి కల్పించడమా? అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అన్నికులాల స్థితిగతులపై లోతుగా అధ్యయనం జరగాలి. ఎవరి జీవితం ఎలా ఉందో అంచనాకు రావాలి. ఎవరికేం చేయాలనే స్పష్టత ఉండాలి. అందుకనుగుణంగా వాస్తవాల ఆధారంగా బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలి. బీసీ కమిషన్ పాత్ర పెరగాలి. విశ్వసనీయత పెరగాలి. అటు ప్రభుత్వంతో, ఇటు ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరపాలి. ఆచరణయోగ్యమైన మార్గం వెతకాలి..’’ అని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసిన బాలమల్లు, వెంకటేశ్వర్‌రెడ్డి