కోటాకు ఓకే చెప్పండి | cm kcr asks pm modi for reservations | Sakshi
Sakshi News home page

కోటాకు ఓకే చెప్పండి

Published Tue, Apr 25 2017 3:08 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

కోటాకు ఓకే చెప్పండి - Sakshi

కోటాకు ఓకే చెప్పండి

  • ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్లపై అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఆమోదించండి: మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి
  • ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టండి
  • వ్యవసాయ అనుబంధ వృత్తులకు పన్ను మినహాయించండి
  • రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి.. హైకోర్టును విభజించండి
  • కాళేశ్వరం లేదా ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వండి
  • రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విన్నపం

  • సాక్షి, న్యూఢిల్లీ
    రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచాలన్న తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అనుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విన్నవించారు.

    ఎస్సీల వర్గీకరణపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. సోమవారమిక్కడ ప్రధాని నివాసంలో గంటపాటు కేసీఆర్‌ ఆయనతో సమావేశమయ్యారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘‘దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక పరిస్థితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెప్పింది. వారి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కూడా 50 శాతానికి మించే ఉన్నాయి. ఓబీసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా సామాజిక, విద్యాపరంగా వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. వారిలో పేదలే ఎక్కువ.

    సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశాం. దానికి కేంద్ర ఆమోదం కావాలి..’’అని కేసీఆర్‌ ప్రధానిని కోరారు. అలాగే రాష్ట్రాల పరిధిలోని విద్యాసంస్థల్లో, నియామకాల్లో ఎవరికెంత రిజర్వేషన్‌ ఇవ్వాలన్న అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. దీనికి ప్రజల మద్దతు కూడా ఉంది. వారి డిమాండ్‌లో న్యాయం ఉంది. అందువల్ల ఎస్సీ వర్గీకరణ విషయంలో వెంటనే స్పందించాలి. పార్లమెంటులో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టాలి’’అని అన్నారు.

    ఆ ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలి
    వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చినట్టే వ్యవసాయ అనుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ‘‘వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రస్తుతం పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అలాగే గ్రామాల్లో వ్యవసాయానుబంధ వృతులపై ఎక్కువ మంది బీసీలు జీవనోపాధి పొందుతున్నారు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, నేత కార్మికులు, రజక, నాయీ బ్రాహ్మణులు రకరకాల కుల వృత్తులవారున్నారు. వీరితోపాటు ఎందరో కళాత్మక వృత్తులు నిర్వహిస్తున్నారు.

    తెలంగాణలో కుల వృత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. బడ్జెట్లో చాలా నిధులు కేటాయించాం. కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. భవిష్యత్తులో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కష్టజీవులు ఆర్థికంగా బాగుపడుతారు. వారికొచ్చే ఆదాయానికి పన్ను విధించడం సమంజసం కాదు’’అని సీఎం ప్రధానికి వివరించారు. జీఎస్‌టీ బిల్లుతో రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలన్నారు.

    అసెంబ్లీ సీట్లు పెంచాలి..
    ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడి తెలంగాణలో శాసన సభ సీట్ల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమరావతిలో పాలన సాగిస్తోందని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,400 కోట్ల మేర కాంపా నిధులను విడుదల చేయాలని కోరారు. కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం నిర్మించుకునేందుకు వీలుగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఎంపీలకు తెలిపారు.

    కేంద్ర న్యాయ శాఖ మంత్రితో భేటీ
    కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం వల్ల భూనిర్వాసితులకు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమవుతుందని వివరించారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి, తన మంత్రిత్వ శాఖ తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement