
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను అడ్డు పెట్టుకుని రోజుకొక కులాన్ని బీసీల్లో కలుపుతూ బీసీ జాబితాను ధర్మసత్రంగా మారుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ప్రభుత్వం బీసీ జాబితాలో కొత్త కులాలను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దోమలగూడ బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండేళ్లు అవుతున్నా బీసీల ప్రయోజనాల కోసం పని చేయకపోగా తాజాగా 30 కులాలను బీసీ జాబితాలో కలుపుతామనడం బీసీల ప్రయోజనాలను దెబ్బ తీయడమేనని విమర్శించారు. బీసీ కమిషన్ ఇప్పటి వరకు బీసీ గణన నిర్వహించలేదని, బీసీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, సామాజిక బహిష్కరణల వంటి చర్యలపై ఏనాడు స్పందించలేదన్నారు.
ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో కలపాలి
బీసీ కమిషన్ బీసీ జాబితాలో కలపాలనుకుంటున్న 30 కులాలు అత్యంత పేదరికం, వివక్ష, అంటరానితనానికి గురైన మాట వాస్తవమని ఇలాంటి కులాలను ఎస్సీ, లేదా ఎస్టీ జాబితాలో కలిపితేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా రోజుకొక కులాల్ని కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాసు, నరాల సుధాకర్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment