తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కొట్టేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ చట్ట సవరణ వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్ తెలిపారు. దీని వల్ల ఓపెన్ కాంపిటీషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment