ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’కు న్యాయపరమైన అవరోధాలు దాదాపుగా తొలగిపోవడంతో త్వరలోనే పుర‘పోరు’కు నగారా మోగనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుపై పురపాలకశాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్ల జాబితా ఈసీకి అందిన మరుక్షణమే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అయితే రిజర్వేషన్ల ఖరారుపై మున్సిపల్‌శాఖ ఆచితూచి అడుగేస్తోంది.
65 మున్సిపాలిటీలపై స్టే..
ప్రధాన కేసు కొలిక్కి వచ్చినా.. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు స్థానిక నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి దాదాపు 65 మున్సిపాలిటీల పరిధిలో ఎన్ని కలను నిలుపుదల చేస్తూ స్టే విధించారు. ఈ ఉత్తర్వులు తొలగితేగానీ అడుగు వేసే పరిస్థితి లేదు. మున్సిపల్ అధికారులు మాత్రం హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులు తాజా పరిణామాలను చర్చించారు. రిజర్వేషన్ల కసరత్తును మొదలుపెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇది పూర్తి చేయడానికి 2, 3 రోజులు పడుతుందని, ఈలోగా స్టేలున్న మున్సిపాలిటీలపై స్పష్టత వస్తుందని మున్సిపల్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. స్టేలు ఉన్న మున్సిపాలిటీలపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ సింగిల్ బెంచ్‌లో కౌంటర్ దాఖలు చేయాలనే యోచనలో మున్సిపల్‌శాఖ ఉన్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లే తరువాయి..!
ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల ఖరారు, జాబితా తయారీ, వార్డుల విభజన పూర్తైనందున ప్రస్తుతం రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయనున్నారు. ఈ కసరత్తు పూర్తి చేశాక పురపాలకశాఖ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 నగర, పురపాలక సంఘాలకు ప్రస్తుతం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. అయితే వాటిలో జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాల కాలపరిమితి ముగియలేదు. జడ్చర్ల, నకిరేకల్‌లలో ఇంకా గ్రామాల విలీనం పూర్తి కాలేదు. సాంకేతిక కారణాల వల్ల పాల్వంచ, మందమర్రి, మణుగూరు ఏజెన్సీ మున్సిపాలిటీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు.
సీఎంతో అధికారుల భేటీ
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పురపాలకశాఖ అధికారులు మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతిని సీఎం ముందుంచిన అధికారులు.. తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఎం సూచనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు, పుర‘పోరు’పై అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment