‘సమాచార’ బంధం తెగింది!
- ఈదురుగాలుల దెబ్బ నుంచి ఇంకా కోలుకోని హైదరాబాద్
- రాజేంద్రనగర్ ప్రాంతంలో మూడో రోజూ వీడని అంధకారం
- విద్యుత్ సరఫరా చేసినా.. సర్వీసు వైర్ల పునరుద్ధరణ మరిచారు
- నగరవ్యాప్తంగా దెబ్బతిన్న చానెల్ యాంటెన్నా రిసీవర్లు, డిష్‌లు
- తెగిపడిన కేబుళ్లతో చాలా చోట్ల టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ బంద్
- చార్జింగ్ లేక మూగబోయిన ఫోన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురుగాలులు, జడివాన దెబ్బకు అటు విద్యుత్ వ్యవస్థతో పాటు ఇటు సమాచార వ్యవస్థకూ తీవ్ర అంతరాయం కలిగింది. చార్జింగ్ లేక సెల్‌ఫోన్లు మూగబోయాయి. పలు చోట్ల సెల్‌ఫోన్ సిగ్నళ్లకూ అంతరాయం కలిగింది. రాజేంద్రనగర్ ప్రాంతంలోనైతే మూడో రోజూ అంధకారమే అలుముకుంది. విద్యుత్ సరఫరా లేక జనం నానా అవస్థలూ పడ్డారు.
ఇక గాలుల తీవ్రతకు కేబుల్ ఆపరేటర్లతోపాటు ఇళ్లలోని డీటీహెచ్ యాంటెన్నాలు, కేబుళ్లు దెబ్బతిన్నాయి. దీంతో అంతో ఇంతో విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లోనూ జనం టీవీలను వినియోగించుకోలేకపోయారు. మరోవైపు వివిధ ఇంటర్నెట్ సర్వీసు సంస్థలకు చెందిన తీగలు తెగిపోవడం, బాక్స్‌లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు చోట్ల ఇంటర్నెట్ కూడా నిలిచిపోయింది.
సర్వీసు వైర్లు దెబ్బతినడంతోనే..
విద్యుత్ లైన్లను పునరుద్ధరించి సరఫరా చేసినప్పటికీ... స్తంభాల నుంచి ఇళ్లలోకి విద్యుత్ సరఫరా చేసే సర్వీసు వైర్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. దాంతో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకుండా పోయింది. ఫలితంగా రాజేంద్రనగర్, బండ్లగూడ, శాంతినగర్, హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, శివరాంపల్లి, హ్యాపీహోమ్స్, గోల్డెన్‌హైట్స్ తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు ఆదివారం రాత్రి కూడా అంధకారంలోనే మగ్గాల్సి వచ్చింది. మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవ డంతో బోర్లు పనిచేయలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికే కాదు, తాగడానికి కూడా మంచినీరు లేక జనం ఇబ్బందులు పడ్డారు. చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.
కొత్త వైరు తెచ్చుకుంటే కనెక్షన్ ఇస్తాం
‘‘ఈదురుగాలి వర్షానికి విద్యుత్ తీగలు, స్తంభాలేకాదు వినియోగదారుల సర్వీసు వైర్లు కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి, విద్యుత్ కూడా సరఫరా చేశాం. సర్వీసు వైర్లు దెబ్బతిన్న చోట కొత్తవి తెచ్చుకుంటే వెంటనే కనెక్షన్ ఇచ్చాం. అక్కడక్కడ కొంత మంది ఇంకా తెచ్చుకోలేదు. సర్వీసు వైరు తెచ్చుకుని సమాచారమిస్తే లైన్‌మెన్ వచ్చి కనెక్షన్ ఇస్తారు..’’
- రఘుమారెడ్డి,
టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ